ముంబై/న్యూయార్క్: ఏప్రిల్ 30 నుంచి మే 4 మధ్య కాలంలో పసిడి కదలికలు అమెరికాకు సంబంధించి రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో మొదటిది బుధవారం జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన సమీక్షకాగా , రెండవది శుక్రవారం నాడు వెలువడే ఏప్రిల్ ఉపాధి కల్పనా గణాంకాలు. ఈ రెండు అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి నాలుగు నెలల శ్రేణిని (1,300 డాలర్లు – 1,370 డాలర్లు) మారడానికి వీలు కల్పించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ (గడచిన వారంలో 90.08 నుంచి 91.31కి పెరుగుదల) కదలికలు పసిడిని ప్రభావం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన వారంలో పసిడి 13 డాలర్లు నష్టపోయి 1,324 డాలర్ల వద్ద ముగిసింది. ఇది నెల కనిష్ట స్థాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సడలుతున్న సంఘర్షణాత్మక ధోరణి ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. కాగా డాలర్ బలోపేతం కొనసాగకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో పసిడి పెట్టుబడులకు మంచిదేనని వారు విశ్లేషిస్తున్నారు. 1,370 డాలర్ల నిరోధాన్ని దాటి పసిడి మరో 100 డాలర్లు దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందన్నది కొందరి విశ్లేషణ.
రూపాయి విలువతో సర్దుబాటు...
అంతర్జాతీయంగా పసిడి విలువ కదలికలు ఎలాఉన్నా... ఆ ప్రభావం దేశీయంగా విభిన్నంగా ఉంటుందన్నది దేశీయంగా నిపుణుల అభిప్రాయం. దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ మార్పులు పసిడి ధరను దేశీయంగా నిర్ణయిస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా డిమాండ్ పరిస్థితులూ దేశంలో ధరను నిర్ధేశిస్తాయని వారు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా గత వారంలో పసిడి గడచిన వారంలో 13 డాలర్లు తగ్గినా, ఇక్కడ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో– ఎంసీఎక్స్‌లో పసిడి రూ.221 మాత్రమే నష్టపోయి 31,211కు చేరింది. రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగి వారాంతంలో 66.62 వద్ద ముగియడం (ఒక దశలో 67ను సైతం దాటింది) ఇక్కడ గమనార్హం. వెండి ధర ఎంసీఎస్‌లో కేజీకి రూ.39,004 వద్ద ముగిసింది. ఇక స్పాట్ మార్కెట్– ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వారంలో రూ.135 చొప్పన తగ్గి, వరుసగా 31,330, రూ.31,180 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.890 పడి 39,270కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment