
ముంబై: ఎలక్ట్రానిక్ విధానంలో బంగారం లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. డీమ్యాట్ ఖాతాల ద్వారా నిర్వహణ, పసిడి నియంత్రణ బోర్డు ఏర్పాటు తదితర ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. వీటి ప్రకారం.. భౌతిక రూపంలోని బంగారాన్ని రిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తమ డీమ్యాట్ ఖాతాలో ఉన్న బంగారాన్ని విక్రేత డీమ్యాట్ ఖాతాకు బదలాయించడం ద్వారా కొనుగోలు చేయొచ్చు. రుణ అవసరాల కోసం కావాలంటే తమ డీమ్యాట్ ఖాతాలో ఉండే బంగారాన్ని తనఖా ఉంచేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా కొనుగోలు లావాదేవీ పూర్తిగా డిజిటల్ రూపంలోనే జరుగుతుంది.
పసిడి పరిశ్రమను సంఘటిత రంగంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికల్లో భాగంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పెట్టుబడి సాధనంగా కూడా వ్యవహరించే బంగారానికి సంబంధించిన పరిశ్రమను నియంత్రించేందుకు ప్రత్యేక గోల్డ్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలన్నింటిపై చర్చించేందుకు కేంద్ర మంత్రుల బృందం త్వరలో సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా ప్రజల దగ్గర దాదాపు 25,000 టన్నుల మేర బంగారం .. నిరుపయోగంగా పడి ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ పసిడి విలువ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 45 శాతం మేర ఉంటుంది.
హాల్‌మార్కింగ్, స్పాట్ ఎక్సే్ఛంజీలు..
ప్రతిపాదనలు అమలు చేయాలంటే ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రత్యేకం గా స్పాట్ ఎక్సే్ఛంజీలు నెలకొల్పాల్సి ఉంటుంది. వీటితో పాటు ముడి పసిడి విదేశీ గనుల నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలు, పసిడి డెలివరీ ప్రమాణాల రూపకల్పన తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం 2015 నవంబర్‌లో పసిడి డిపాజిట్ల పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటిదాకా పెద్దగా స్పందన రాలేదు. దీంతో కొత్త ప్రతిపాదనల ప్రకారం.. జీఎంఎస్ కింద డిపాజిట్ చేసిన బంగారాన్ని కూడా డీమ్యాట్ హోల్డింగ్‌గా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇదంతా అంత వెంటనే అమలు చేయగలిగే వ్యవహారం కాదని పరిశీలకులు అంటున్నారు. షేర్లకు సంబంధించి 1997లో డీమ్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టాక పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టేసిందని గుర్తు చేస్తున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఉదాహరణకు మీ దగ్గర 500 గ్రాముల బంగారం కడ్డీ ఉందనుకుందాం. దాని నాణ్యతను ధ్రువీకరించి, రిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర డీమ్యాట్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బంగారం కడ్డీని కస్టోడియన్‌గా వ్యవహరించే సంస్థ భద్రపరుస్తుంది. ఇందుకు సంబంధించిన రికార్డులను రిపాజిటరీ నిర్వహిస్తుంది. మీరెప్పుడైనా ఏదైనా ఆభరణాల్లాంటివి కొనుక్కోవాలనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి మొత్తం లేదా కొంత భాగాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో జ్యుయలర్‌కు బదలాయించవచ్చు. లేదా స్పాట్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు (ఇందుకు సంబంధించిన స్పాట్ ఎక్సే్ఛంజ్ ఏర్పాటైన తర్వాత). కావాలనుకుంటే ఎలక్ట్రానిక్ విధానంలో భద్రపర్చిన బంగారాన్ని తనఖా ఉంచి రుణాలు కూడా తీసుకోవచ్చు.
డీమ్యాట్‌లో బంగారం ఉంచడంలో సవాళ్లు..
►ఎంతో పేదవారు సైతం ఎంతో కొంత బంగారాన్ని కొని దాచుకుంటూ ఉంటారు. వీరికి డీమ్యాట్ ఖాతాలు మొదలైనవాటి నిర్వహణ గురించి కాస్తంత కూడా అవగాహన ఉండదు.
►ఇక ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలమే పట్టేస్తుంది.
►భారత్‌లో రిఫైన్ చేసిన బంగారం కడ్డీలపై సీరియల్ నంబర్లు వేయాల్సి ఉంటుంది.
►ఆభరణాలను కచ్చితంగా హాల్‌మార్క్ చేయాలి. విశిష్ట గుర్తింపు సంఖ్యలు కేటాయించాలి.
►దేశీయంగా లెక్కల్లో కనిపించని బంగారమే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బంగారు కడ్డీలు, ఆభరణాలకు సీరియల్ నంబర్లు లేకపోవడం వల్ల వాటి విలువ పడిపోయే అవకాశముంది.