మూడేళ్లలో 20 లక్షల మందికి గూగుల్ శిక్షణ
ఆండ్రాయిడ్ స్కిల్ ప్రోగ్రామ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ తన ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా భారత్‌లో వచ్చే మూడేళ్ల కాలంలో దాదాపు 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేయనుంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ ఫండమెంటల్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం ‘ఆండ్రాయిడ్ డెవలపర్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆండ్రాయిడ్ కోర్సులు ప్రభుత్వ, ప్రైవేట్ యూనివ ర్సిటీలకు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌డీసీ) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కు అందుబాటులో ఉంటాయని వివరించింది. విద్యార్థులు, డెవలపర్స్, ట్రైనర్స్ తదితరులకు ఈ శిక్షణ తీసుకోవచ్చని గూగుల్ హెడ్ (డెవలపర్ ట్రైనింగ్) పీటర్ లుబెర్ తెలిపారు. ఔత్సాహికులకు ఎన్‌పీటీఈఎల్‌లోనూ ఉచితంగా ఈ కోర్సులను చదవొచ్చన్నారు. కంపెనీ దీనితోపాటు ‘అసోసియేట్ ఆండ్రాయిడ్ డెవలపర్ సర్టిఫికేషన్’ అనే జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. అభ్యర్థులు శిక్షణ అనంతరం ఈ పరీక్ష రాయొచ్చు. దీన్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై ఉద్యోగం సాధించడం సులభమవుతుంది. దీనికి రూ.6,500 ఫీజు ఉంటుంది.