న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు కంపెనీలు, స్టార్టప్ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. జపాన్, తైవాన్ తదితర దేశాలతో పాటు దేశీ సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. కొత్త ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడంపై ఇవి మరింతగా దృష్టి సారిస్తున్నాయి. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్రణాళిక ప్రకారం 2020 నాటికి 60 లక్షల నుంచి 70 లక్షల దాకా హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వాహనాల్ని తేవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు మారిపోతుండటం, వాహనాల చార్జింగ్ కోసం ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం మొదలైనవి ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో పెద్ద అవరోధాలుగా మారాయి. దీంతో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ మొదలైనవి వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. అయితే, కొత్తగా ఈ విభాగంలోకి ప్రవేశించాలనుకుంటున్న కంపెనీలు ఈ అవరోధాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. భారత్‌లో 2014 నుంచి ఈ–రిక్షాలు విక్రయిస్తున్న జపాన్‌కి చెందిన టెరా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను తేవాలని యోచిస్తోంది.
వచ్చే జనవరికల్లా దీన్ని ఆవిష్కరించాలని, ఏటా 5 లక్షల అమ్మకాలు సాధించాలని నిర్దేశించుకుంది. ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం భారీగా ఉండే భారత్, ఇతరత్రా దక్షిణాసియా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గణనీయంగా డిమాండ్ ఉంటుందని టెరా మోటార్స్ భావిస్తోంది. అందుకే దక్షిణాసియా దేశాల మార్కెట్లలోకి కూడా విస్తరించేందుకు వీలుగా భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి నాటికి ఈ–ఆటో రిక్షాను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే వీటి గరిష్ట వేగం గంటకు 50–60 కి.మీ. దాకా ఉంటుంది. ఆటో రిక్షాలను ఆవిష్కరించడానికి ముందుగానే, చార్జింగ్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని టెరా యోచిస్తోంది. ఇందుకోసం భారత రవాణా శాఖతో లాబీయింగ్ చేసేందుకు జపాన్ సహకారాన్ని తీసుకుంటోంది. టెరా మోటార్స్ దేశీయంగా 2014లో అమ్మకాలు మొదలుపెట్టినప్పట్నుంచి 12,000 యూనిట్లు విక్రయించింది. ప్రస్తుతం అసోం, బెంగాల్, బీహార్‌లో ఈ–రిక్షాలు విక్రయిస్తున్న కంపెనీ.. తాజాగా ఉత్తరాది మార్కెట్లపైనా దృష్టి పెట్టింది. ఈ–రిక్షాల మార్కెట్ పరిమాణం ఏటా 80,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైందని, అందుకే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మార్కెట్ వైపు దృష్టి సారిస్తున్నామని టెరా మోటార్స్ ఎండీ అకిహిరో తెలిపారు.
ఆర్టెమ్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఇక ఆర్టెమ్ ఎనర్జీ ఫ్యూచర్ అనే దేశీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ సంస్థ కూడా ఆర్టెమ్ ఎం9 పేరిట ఈ–స్కూటర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. లగ్జరీ కార్లలో ఉండే అత్యంత సురక్షితమైన, అత్యాధునిక ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెబుతోంది. భద్రత, టెక్నాలజీలే తమ ప్రధాన బలమని అంటోంది. చార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ ఫాస్ట్ చార్జర్‌ను అమర్చడంతో పాటు బ్యాటరీల మార్పిడి వెసులుబాటు కూడా ఎం9లో అందిస్తామని ఆర్టెమ్ వెల్లడించింది. వంద కిలోమీటర్ల దాకా ప్రయాణించగలిగే సామర్ధ్యం ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొంది.
తైవాన్ కంపెనీల ఆసక్తి..
దేశీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడానికి ఆగ్నేయాసియా దేశాల కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. ఈవీలకు సంబంధించిన సాంకేతికాంశాలు, టెక్నాలజీపై పరస్పరం సహకరించుకునే దిశగా.. గత నెలలోనే సొసైటీ ఆఫ్ మ్యాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ .. తైవాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు తయారు చేసే 11 తైవాన్ కంపెనీలు ఈ నెలలో భారత్ సందర్శించనున్నాయి.
కంపెనీల ఎలక్ట్రిక్ సవారీ!
Published Fri, May 11 2018 12:50 AM | Last Updated on Wed, Sep 5 2018 3:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment