నల్లధనం పై కొరడా..! | Government focus on NRI assest | Sakshi
Sakshi News home page

నల్లధనం పై కొరడా..!

Published Sat, Jul 4 2015 1:56 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లధనం పై కొరడా..! - Sakshi

నల్లధనం పై కొరడా..!

దాచిపెట్టిన విదేశీ ఆస్తులపై మార్కెట్ విలువ ప్రకారం పన్ను, జరిమానా
- నోటిఫై చేసిన నిబంధనలను వెల్లడించిన సీబీడీటీ
- ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నల్లధనం చట్టం
- విదేశీ ఆస్తులు, ఆదాయాల వెల్లడికి సెప్టెంబర్ 30 వరకూ ప్రత్యేక విండో..
- మార్కెట్ విలువలో 60 శాతం పన్ను, జరిమానా...
- ఈ గడువు దాటితే 120 శాతం కట్టాల్సిందే...
న్యూఢిల్లీ:
విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం కేసుల్లో ఇక కేంద్రం కొరడా ఝులిపించనుంది. పార్లమెంటు ఆమోదం పొందిన నల్లధనం(ప్రభుత్వానికి వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్నుల విధింపు చట్టం-2015లోని నిబంధనలను కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. సీబీడీటీ నోటిఫైచేసిన ఈ కొత్త చట్టం ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చింది.

దీని ప్రకారం విదేశాల్లో అక్రమంగా దాచిపెట్టిన ఆస్తుల(ఆభరణాలు, షేర్లు, కళాఖండాలు వంటివి) విలువను ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కించి.. పన్ను, జరిమానాలను విధించడం జరుగుతుందని సీబీడీటీ తెలిపింది. అంతేకాకుండా విదేశాల్లో అక్రమంగా కలిగిఉన్న విదేశీ బ్యాంకు ఖాతా విలువను కూడా దాన్ని ప్రారంభించిన నాటి నుంచి జమ అవుతూవచ్చిన డిపాజిట్ల మొత్తం ఆధారంగా లెక్కించి.. పన్ను, జరిమానాలను విధించేలా చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.

నల్లధనం కేసుల్లో గుర్తించిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ అప్పట్లో కొనుగోలు చేసిన విలువ కంటే తక్కువగా ఉన్న పక్షంలో... వాటి వాస్తవ కొనుగోలు విలువనే పరిగణనలోకి తీసుకొని పన్నులు, జరిమానాలను విధించే అధికారం సీబీడీటీకి ఉంటుంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
- బయటికి వెల్లడించని విదేశీ ఆస్తులు కలిగిఉన్న వ్యక్తులెవరైనా వాటి వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 30 వరకూ ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని(వన్‌టైమ్ కాంప్లియన్స్ విండో) ఏర్పాటు చేసింది. అంటే 90 రోజుల గడువు ఇచ్చినట్లు లెక్క. ఈ లోగా నిర్దేశిత ఫార్మాట్‌లో రూపాయల్లో తమ విదేశీ ఆస్తుల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
- ఇలా వెల్లడించిన మొత్తం ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఈ చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంటుంది.
- కాంప్లియన్స్ విండో గడువు ముగింపు తేదీ తర్వాత వివరాలను వెల్లడించినట్లయితే మొత్తం విలువలో 120 శాతాన్ని పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిందే.
- స్థిరాస్తులకు సంబంధించి సరైన మార్కెట్ విలువ అనేది వాటి కొనుగోలు ధర కంటే ఎక్కువగా లేదా లెక్కింపు(వేల్యుయేషన్) రోజున ఓపెన్ మార్కెట్‌లో వచ్చే రేటు ప్రకారం నిర్ణయిస్తారు.
- బంగారం, వజ్రాలు ఇతర విలువైన రాళ్లు, ఆభరణాలు, పురాతత్వ(ఆర్కియలాజికల్) కలెక్షన్లు, శిల్పాలు, పెయింటింగ్స్ ఇతరత్రా కళాఖండాలకు కూడా ఇదే వేల్యుయేషన్ విధానం వర్తిస్తుంది.
- షేర్లు, సెక్యూరిటీల మార్కెట్ విలువను కొనుగోలు ధర కంటే ఎక్కువగా లేదా లెక్కింపు తేదీన కనిష్ట, గరిష్ట ధరల సగటు ఆధారంగా ఉండాలి.
- ఈ నిబంధనలతో పాటు దాచిపెట్టిన విదేశీ ఆస్తులను ప్రకటించే వ్యక్తులు వివరాలను దాఖలు చేసేందుకు 7 రకాల ఫారాలను ప్రవేశపెట్టారు.
- విదేశీ ఆస్తులున్న ప్రదేశం, సరైన మార్కెట్ విలువ, ఎప్పుడు కొనుగోలు చేశారు అనే వివరాలను సంబంధిత వ్యక్తులు తెలియజేయాల్సి ఉంటుంది.
- విలువ లెక్కింపు రోజున విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని దేశీ కరెన్సీలోకి మార్చడానికి ఆర్‌బీఐ రిఫరెన్స్ రేటును పరిగణనలోకి తీసుకుంటారు.
- బయటకు వెల్లడించని విదేశీ ఆస్తులున్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు అదేవిధంగా వాళ్లు, కమిషనర్(అప్పీల్స్), అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు తగిన ఫార్మాట్ కూడా ఉంది.
- కాంప్లియన్స్ విండోను ఉపయోగించుకోవాలనుకునే వారి కోసం ఆదాయ పన్ను శాఖ న్యూఢిల్లీలో ప్రత్యేక ఆఫీసు ఏర్పాటు చేసింది. దీనికి వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు, ప్రాసెస్ చేసేందుకు సీనియర్ కమిషనర్ స్థాయి అధికారిని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరాన్ని బట్టి మరింత మంది అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement