మా దగ్గర రూ. 3,770 కోట్ల నల్లధనం!
న్యూఢిల్లీ: తమ దగ్గర నల్లధనం ఉందని 638 మంది వెల్లడించారు. తమ వద్ద మొత్తం రూ. 3,770 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటన చేసింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ ను బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా తెరచివుంచినట్టు సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ తెలిపారు. ఇప్పటివరకు వివరాలు వెల్లడించిన వారు పన్నులు, బకాయిలు చెల్లించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని వెల్లడించారు. నల్లధనం వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.
బయటికి వెల్లడించని విదేశీ ఆస్తులు కలిగిఉన్న వ్యక్తులెవరైనా వాటి వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని(వన్‌టైమ్ కాంప్లియన్స్ విండో) కల్పించింది. గడుపులోపు వెల్లడించిన మొత్తం ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఈ చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంటుంది. కాంప్లియన్స్ విండో గడువు ముగింపు తేదీ తర్వాత వివరాలను వెల్లడించినట్లయితే మొత్తం విలువలో 120 శాతాన్ని పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిందే.