స్కూళ్లూ, జైళ్లూ కూడా ప్రైవేట్‌పరం చేయాలి
♦ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి
♦ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. కెనడా.. ఆస్ట్రేలియా వంటి దేశాల తరహాలోనే స్కూళ్లు, కాలేజీలు, జైళ్లను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఇండియా పీపీపీ సదస్సు 2017లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించింది. కానీ నిర్వహణ మాత్రం గొప్పగా చేయలేదు.
అందుకే ప్రభుత్వం రివర్స్ బాట్ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) విధానానికి మళ్లాలి.. ప్రాజెక్టులను విక్రయించేసి, నిర్వహణను ప్రైవేట్ రంగానికే అప్పగించాలి‘ అని కాంత్ చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల్లోని బాత్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఉదహరిస్తూ.. ఇలాంటివన్నీ ప్రైవేట్ రంగానికి అప్పగించాలని సూచించారు.