
సాక్షి,న్యూఢిల్లీ: రోజురోజుకూ భారమవుతున్న ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఉల్లి ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులకు టన్నుకు రూ 800 డాలర్ల కనిష్ట ఎగుమతి ధరను (ఎంఈపీ) నిర్ణయించేందుకు కసరత్తు చేస్తోంది. ఎంఈపీ కన్నా తక్కువ ధరకు ఎగుమతులను అనుమతించరు. 2015లో ఉల్లికి ఎంఈపీని తొలగించిన విషయం తెలిసిందే. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉల్లి ధరల నియంత్రణ, ఎంఈపీపై వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు, పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా చర్చించింది.
ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు, స్ధానిక మార్కెట‍్లలో ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు ఎంఈపీ విధించాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ దిశగా త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు.