
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని (ఏఐఎస్‌ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మ కంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు గురువారం ఆయన లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ద్వారా తెలిపారు.
దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియా .. 2018–19లో రూ. 8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, ఏవియేషన్ రంగంలో పరిస్థితులను మెరుగుపర్చే దిశగా.. జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, వచ్చే అయిదేళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 25,000 కోట్లు వెచి్చంచనుందని వివరించారు. నిధుల సంక్షోభంతో జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మూతబడిన సంగతి తెలిసిందే.
పారదర్శకంగా జరగాలి: ఐఏటీఏ
దేశీ విమాయాన రంగంలో పోటీతత్వం మెరుగుపడే విధంగా.. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ సక్రమంగా, పారదర్శక విధానంలో జరగాలని విమానయాన సంస్థల అంతర్జాతీయ సమాఖ్య ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ డి జునియాక్ అభిప్రాయపడ్డారు. అలాగే ఎయిరిండియాకు ప్రస్తుతం ఇస్తున్న వనరులను .. మొత్తం ఏవియేషన్ రంగానికి అందించేందుకు ప్రభుత్వానికీ వెసులుబాటు లభించవచ్చని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో గట్టి పోటీ, భారీ నిర్వహణ వ్యయాల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఆపరేటర్లకు చాలా కష్టంగా ఉంటోందని జునియాక్ అభిప్రాయపడ్డారు.