హడ్కోలో 10 శాతం వాటా విక్రయానికి ఓకే
♦ ఇష్యూ ధరలో 5 శాతం డిస్కౌంట్
♦ రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కొ)లో 10 శాతం వాటా విక్రయానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి(క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఆఫైర్స్-సీసీఈఏ).. హడ్కోలో పెయిడప్ ఈక్విటీ(చెల్లించిన మూలధనం)లో 10 శాతం వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, హడ్కో ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వాలని కూడా సీసీఈఏ నిర్ణయించిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీ రికమండేషన్ల ఆధారంగా ఆల్టర్నేటివ్ మెకానిజమ్ ప్రాతిపదికన రిటైల్ ఇన్వెస్టర్లకు ఇచ్చే వాస్తవ డిస్కౌంట్‌ను నిర్ణయిస్తారు. ప్రస్తుతం హడ్కో కంపెనీ షేర్ ముఖ విలువ రూ.10. కాగా నెట్‌వర్త్ రూ.7,800 కోట్లు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌హెచ్‌పీసీలో 11.36 శాతం వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వాటా విక్రయంతో రూ.2,700 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నాల్కో, వంటి మరో 15 పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను విక్రయించనున్నది.