పసిడి ఎగుమతులపై నిషేధం
♦ 22 క్యారెట్ల స్వచ్ఛతపైన
♦ కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రిప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతులున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది.
22 క్యారెట్లలోపు స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగల బంగారం ఉత్పత్తులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) అధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వపు తాజా నిషేధం బంగారం ఎగమతులపై ప్రభావం చూపబోదని, అంతర్జాతీయ మార్కెట్‌లో 22 క్యారెట్లపైన స్వచ్ఛతగల బంగారం వస్తువులకు డిమాండ్ చాలా తక్కువగానే ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈవో) వివరించింది. దక్షిణ కొరియా నుంచి దేశంలోకి బంగారం దిగుమతులు బాగా పెరిగాయని దేశీ బంగారు ఆభరణాల వర్తకులు ఆందోళన చెందుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.