ఐపీఓకు ఆరు పీఎస్‌యూలు | Govt chooses six PSUs for listing on stock exchanges | Sakshi
Sakshi News home page

ఐపీఓకు ఆరు పీఎస్‌యూలు

Published Thu, Apr 13 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

ఐపీఓకు ఆరు పీఎస్‌యూలు

ఐపీఓకు ఆరు పీఎస్‌యూలు

► అన్నీ లాభాల్లో నడుస్తున్నవే 
► ఆరులో నాలుగు రక్షణ రంగానివి 
► మర్చంట్‌ బ్యాంకులకు ఆహ్వానం  

లిస్ట్‌ కానున్న పీఎస్‌యూలు ఇవే..

ఎంఎస్‌టీసీ
నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌
♦  భారత్‌ డైనమిక్స్‌
గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌
మజగాన్‌  డాక్‌ షిప్‌బిల్డర్స్‌
మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్

 

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థలను లిస్ట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌)లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆరు పీఎస్‌యూలు– ఎంఎస్‌టీసీ, నెప్‌కో, భారత్‌ డైనమిక్స్, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్, మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌– లాభాలార్జిస్తున్న పీఎస్‌యూలు కావడం విశేషం. ఈ ఆరు పీఎస్‌యూల్లో నాలుగు రక్షణ రంగానికి చెందినవి ఉన్నాయి.

మర్చంట్‌ బ్యాంకర్ల కోసం అన్వేషణ...
ఈ ఆరు కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్స్‌)లకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించే,  న్యాయ సలహా ఇచ్చే  సంస్థలను ఎంపిక చేసే ప్రయత్నాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ప్రారంభించింది.  ఆసక్తి గల సంస్థలు వచ్చే నెల 2లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆరు పీఎస్‌యూల్లో కేంద్ర ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.46,500 కోట్లు, వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎంఎస్‌టీసీ
ఈ మినీరత్న పీఎస్‌యూ ఉక్కు  శాఖ అధీనంలో ఉంది. ఈ ట్రేడింగ్‌ కంపెనీ ఉక్కు, పెట్రో కెమికల్‌ రంగాలకు ముడి పదార్థాల తోడ్పాటునందిస్తోంది. ఈ–కామర్స్‌ సేవలను కూడా అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.50 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్‌ రూ.732 కోట్లు.

నెప్‌కో
నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(నెప్‌కో) కూడా మినీ రత్న పీఎస్‌యూనే. విద్యుత్తు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఈ కంపెనీ జల, బొగ్గు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5,220 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యుత్తు అవసరాల్లో 40%  ఈ సంస్థే తీరుస్తోంది. కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.5,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.373 కోట్ల నికర లాభం ఆర్జించింది. నెట్‌వర్త్‌ రూ.5,988 కోట్లు.

భారత్‌ డైనమిక్స్‌
ఇది కూడా మినీ రత్న పీఎస్‌యూనే. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1970లో స్థాపితమైన ఈ కంపెనీ గైడెడ్‌ మిస్సైళ్లను, ఇతర రక్షణ రంగ సంబంధిత పరికరాలను తయారు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 31నాటికి  కంపెనీ అధీకృత వాటా మూలధనం రూ.125 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.122 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.563 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్‌ రూ.1,652 కోట్లు.

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌
ఈ కంపెనీ కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1934లో ప్రారంభమైన ఈ కంపెనీని 1960లో ప్రభుత్వం టేకోవర్‌ చేసింది. యుద్ధనౌకలు, నావికా దళం, తీరప్రాంత గస్తీ దళాలకు అవసరమైన నౌకలను తయారు చేస్తోంది. ఈ కంపెనీ అధీకృత మూలధనం రూ.125 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.124 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.161 కోట్ల నికర లాభం సాధించింది. కంపెనీ నెట్‌వర్త్‌ రూ.1,064 కోట్లు.

మజగాన్‌  డాక్‌ షిప్‌బిల్డర్స్‌
ఈ కంపెనీ కూడా మినీరత్న పీఎస్‌యూనే. దేశపు వ్యూహాత్మక అవసరాలను తీరుస్తోంది. మూడు భారీ యుద్ధ నౌకలను, ఒక జలాంతర్గామిని నిర్మిస్తోంది. 1934లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ప్రారంభమైన ఈ కంపెనీని కేంద్రప్రభుత్వం 1960లో టేకోవర్‌ చేసింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఈ కంపెనీ అధీకృత మూలధనం రూ.324 కోట్లుగా, చెల్లించిన ఈక్విటీ మూలధనం రూ.249 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.249 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ నెట్‌వర్త్‌ రూ.2,846 కోట్లు.

మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)
రక్షణ రంగ అధీనంలోని ఈ కంపెనీ లోహాలు, మిశ్రమ లోహాలను తయారు చేస్తోంది. దిగుమతి చేసుకుంటున్న లోహాలు, మిశ్ర లోహాలకు ప్రత్యామ్నాయాలను అందించడానికి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, లోహాల విషయమై స్వావలంబన సాధించడానికి ఈ కంపెనీని స్థాపించారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ అధీకృత మూలధనం రూ.200 కోట్లుగా, చెల్లించిన మూలధనం రూ.187 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.118 కోట్ల నికర లాభం ఆర్జించింది. నెట్‌వర్త్‌ రూ.577 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement