ముంబై/న్యూఢిల్లీ: దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ ఉదంతం తరహాలోనే తాజాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుత బోర్డును రద్దు చేసింది. ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును నియమించింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంక్షోభం దేశీ మార్కెట్లలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు తమకు అప్పగించాలని, బోర్డును మార్చాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) సోమవారం పిటిషన్ వేసింది. ఇందుకు అనుమతులిస్తూ ఎన్‌సీఎల్‌టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కేంద్రం లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 15లోగా వివరణనివ్వాలంటూ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు నోటీసులు ఇచ్చింది.
‘ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత.. కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 (2), 242లను ప్రయోగించడానికి, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్యకలాపాలు.. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రకటించడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం‘ అని ఎన్‌సీఎల్‌టీ బెంచ్ పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ సంస్థ వ్యవహారాలను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించవచ్చు.
ట్రిబ్యునల్ కూడా తగు ఆదేశాలివ్వవచ్చు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత కేంద్రం స్వయంగా ఒక కంపెనీ బోర్డును తన నియంత్రణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. కుంభకోణం దరిమిలా 2009లో సత్యం బోర్డును అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం, ఆ తర్వాత కంపెనీ.. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చేతికి చేరడం తెలిసిందే.
ఎకానమీకి ముప్పు..
కంపెనీ ఆర్థిక స్థిరత్వంపైన, క్యాపిటల్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత బోర్డును, యాజమాన్యాన్ని కొనసాగించడం వల్ల కంపెనీతో పాటు, సంస్థలో సభ్యులకూ ఇబ్బందేనని, ప్రజా ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఎన్‌సీఎల్‌టీ ముందు ఎంసీఏ తమ వాదనలు వినిపించింది. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలం కావడం వల్లే దాదాపు రూ. 1.15 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నప్పటికీ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల మేర రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆక్షేపించింది.
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కంపెనీ గానీ దివాలా తీస్తే అనేక మ్యూచువల్ ఫండ్స్ పతనమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి భారీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) మూతబడితే... ఆర్థిక మార్కెట్లలో నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం దేశ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున పరిస్థితి చక్కదిద్దేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది.
గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతంలోనూ కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతిని నివేదించింది. ఇప్పటికే కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మరిన్ని రుణాలు డిఫాల్ట్ కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
విశ్వాస పునరుద్ధరణ ముఖ్యం ..
ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు తగినన్ని నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు, మరిన్ని డిఫాల్టుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని పేర్కొంది.
క్యాపిటల్, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం కోసం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌పై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కీలకమని తెలిపింది. సంస్థను గట్టెక్కించేందుకు అసెట్స్ విక్రయం, కొన్ని రుణాల పునర్‌వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లు.. ఆర్థిక సంస్థలు కొత్తగా మరిన్ని నిధులు సమకూర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరిన్ని దివాలా ఉదంతాలను నివారించడానికి ఇవి అత్యవసరమని పేర్కొంది.
ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు
ఆరుగురు సభ్యుల కొత్త బోర్డుకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినీత్ నయ్యర్, ఐఏఎస్ అధికారిణి మాలినీ శంకర్, సీనియర్ ఆడిటర్ నందకిశోర్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 8న ఈ బోర్డు తొలిసారిగా సమావేశం కానుంది. అక్టోబర్ 31 నాటికల్లా తమ పరిశీలనలు, మార్గదర్శ ప్రణాళికపై నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: జైట్లీ
జాతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్.. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని జైట్లీ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లాంటి విపరీత ఆలోచనా విధానాలున్నవారే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో ఆర్థిక సంస్థల పెట్టుబడులను కుంభకోణంగా వర్ణిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఐఎల్ ఎఫ్‌ఎస్‌కు తోడ్పాటునివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన కేవీ థామస్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి కాసిన్ని వివరాలు తెలుసుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు.
తన ఫేవరెట్ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్ దివాలా తియ్యకుండా చూసేందుకు, మోసగాళ్లను కాపాడేందుకు ఎల్‌ఐసీ డబ్బును ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై జైట్లీ ఈ మేరకు స్పందించారు. ‘50.5% వాటాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 30.5% వాటాతో యూటీఐ.. 1987లో ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటు కుంభకోణమా? 2005లో ఎల్‌ఐసీ 15%, 2006లో మరో 11.10% వాటాలు కొనడం కూడా కుంభకోణమేనా? 2010లో ఎల్‌ఐసీ మరో 19.34 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడులన్నీ కుంభకోణమే అంటారా‘ అని జైట్లీ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment