
పబ్లిక్ ఇష్యూకి వైజాగ్ స్టీల్ సన్నాహాలు
- సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
- జనవరిలో రానున్న ఐపీవో
- రిటైలర్లకు ధరలో 5% డిస్కౌంట్
- విక్రయానికి 49 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టీల్ దిగ్గజం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(వైజాగ్ స్టీల్) మరోసారి పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా కంపెనీలో ప్రభుత్వం 10% వాటాను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ 10% వాటాకు సమానమైన దాదాపు 48.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వీటిలో 50% షేర్లను అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించనుండగా, 35% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించనుంది. అయితే మొత్తం బుక్ బిల్డింగ్ విధానం పూర్తయ్యేసరికి మూడు నెలలు పట్టవచ్చు.
ఫలితంగా ఐపీవో వచ్చే ఏడాది(2015) జనవరిలో వెలువడే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలో ప్రభుత్వానికి 100% వాటా ఉంది. ఐపీవో తరువాత కంపెనీలో ప్రభుత్వ వాటా 90%కు పరిమితం కానుంది. 5% తక్కువకే...: విశాఖ స్టీల్ ఐపీవోలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ధరలో 5% వరకూ డిస్కౌంట్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి యూబీఎస్ సెక్యూరిటీస్, డాయిష్ ఈక్విటీస్ మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. ఇష్యూ ధరను తదుపరి దశలో కంపెనీ నిర్ణయించనుంది.
ఇష్యూ ద్వారా సమీకరించే పెట్టుబడులను ప్రభుత్వం అందుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వ వాటా విక్రయానికి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో వివిధ ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మొత్తం రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిలో భాగంగా సెయిల్, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియాలలో సైతం వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. వైజాగ్ స్టీల్ ఐపీవో ద్వారా రూ. 2,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.