జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు | GST will make tax evasion difficult, warns Arun Jaitley | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు

Published Thu, Mar 23 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

శశికాంత్‌ శర్మ నుంచి జ్ఞాపికను అందుకుంటున్నఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

శశికాంత్‌ శర్మ నుంచి జ్ఞాపికను అందుకుంటున్నఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

పన్నుల ఎగవేతకు చెక్‌ పడుతుంది
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును జూలై 1 నుంచి అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టంచేశారు. నూతన పన్ను విధానంతో ప్రపంచంలో అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా మన దేశం అవతరిస్తుందని, పన్నులు ఎగ్గొట్టడం కష్టతరమవుతుందని, కమోడిటీలు చౌకగా మారతాయని ఆయన తెలియజేశారు. బుధవారమిక్కడ జరిగిన కామన్వెల్త్‌ ఆడిటర్‌ జనరల్‌ 23వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశ జీడీపీ 7–8 శాతం వృద్ధి సాధించేందుకు తోడ్పడతాయని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారాయన. అయినప్పటికీ చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, ప్రభుత్వరంగ బ్యాంకులను చక్కదిద్దడం వంటి సవాళ్లున్నట్టు హెచ్చరించారు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి బాటలో అడుగుపెడితే మనదేశ వృద్ధి రేటు మరింత అధిక స్థాయికి చేరుతుందన్నారు.

ధరలు దిగొస్తాయి...: ‘‘జీఎస్టీ అన్నది అతిపెద్ద సంస్కరణ. దీన్ని జూలై 1 నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీంతో వస్తు సేవల సరఫరా సాఫీగా సాగిపోతుంది. పన్ను ఆదాయం పెరుగుతుంది. బలమైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వల్ల పన్ను ఎగవేత కష్టమవుతుంది. ఎన్నో అంచెల పన్ను విధానాల వల్ల సరుకుల ధరలు అధికంగా ఉంటున్నాయి. 17 రాష్ట్రాల పన్నులు, కేంద్ర పన్ను స్థానంలో జీఎస్టీ అమల్లోకి వస్తుంది. పన్ను మీద పన్ను లేకపోవడం వల్ల సరుకులు, కమోడిటీలు, సేవల ధరలు కొంచెం చౌకగా మారతాయి’’ అని జైట్లీ వివరించారు. నాలుగు జీఎస్టీ అనుబంధ బిల్లులను కేంద్ర కేబినెట్‌ ఈ వారం ఆమోదించటం తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు.

పన్నుల ఎగవేతకు చెక్‌...
మన దేశంలో ఎక్కువ శాతం మంది పన్ను చట్టాలను పట్టించుకోవటం లేదని జైట్లీ చెప్పారు. ప్రజల్లో నగదు ఆధారిత చలామణి ధోరణి ఎక్కువగా ఉండడంతో పన్నుల ఎగవేత జరుగుతోందన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఎగవేతలకు చెక్‌ పడుతుందన్నారు. ‘‘నగదు లావాదేవీలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యక్ష పన్ను చట్టానికి సవరణ తెచ్చాం. రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధించే ఆర్థిక బిల్లును పార్లమెంటు ఆమోదించింది. జీడీపీలో నగదు చలామణి 12.2 శాతం ఉండగా... దీనిలో 86 శాతం పెద్దనోట్లేనన్నారు.

అధిక స్థాయిలో నగదు ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారింది. నేరాలు, అవినీతి, ఉగ్రవాదులకు నిధుల సాయం, పన్నుల ఎగవేత, విద్రోహ చర్యలకు నగదు వీలు కల్పిస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశాం’’ అని జైట్లీ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటైజేషన్‌ పెరిగితే సమాంతర ఆర్థిక వ్యవస్థకు చెక్‌ పడుతుందని, తెరచాటు ఆర్థిక వ్యవస్థ కాస్తా అధికారిక ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐటీ రిటర్న్‌లకు ఆధార్‌ తప్పనిసరి
పన్ను ఎగవేత, మోసాలను అరికట్టేందుకు ఆదాయపన్ను రిటర్న్‌లకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంపై పునరాలోచించాలన్న విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చారు. ఫైనాన్స్‌ బిల్లు–2017పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఆధార్‌ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు చెప్పిందని, ఆ నంబర్‌ను తీసుకోవాలని ప్రజలను బలవంతం చేస్తున్నారా అని బీజేడీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్‌ ప్రశ్నించగా, ‘అవును’ అని జైట్లీ సమాధానమిచ్చారు. తర్వాత 40 అధికారిక సవరణలతో బిల్లును సభ ఆమోదించింది. ఏప్రిల్‌ 1 నుంచి నగదు లావాదేవీల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 2 లక్షలకు కుదించడం, మంత్రిత్వ శాఖల ట్రిబ్యునళ్ల వీలీనం తదితరాల కోసం ఈ సవరణలు చేశారు.

పన్ను వసూళ్లు 17 లక్షల కోట్లు పైనే..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాలను మించి ఉం టాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు.   పన్ను వసూళ్లు తక్కువగా ఉంటాయన్న  ప్రతిపక్ష సభ్యుల  ఆందోళనపై జైట్లీ స్పందిచారు. ‘‘ప్రత్యక్ష, పరోక్ష పన్నుల లక్ష్యాన్ని రూ.16.25 లక్షల కోట్లుగా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించాం. దీన్ని రూ.17 లక్షల కోట్లకు సవరించాం కూడా. ఏదైమైనప్పటికీ ఈ ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మా లక్ష్యం రూ.19.05 లక్షల కోట్లు’’ అని జైట్లీ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement