
హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో: ఇటు హెల్త్‌కేర్‌తో పాటు అటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ దేశీయంగా మంచి వృద్ధి కనబరుస్తామని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘విరించి లిమిటెడ్’ స్పష్టంచేసింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి తమ సంస్థ అభివృద్ధి చేసిన ఫిన్ టెక్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో రాణిస్తున్నాయంటూ.. డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగానూ వీటిని ప్రవేశపెడతామని సంస్థ ఛైర్మన్ విశ్వనాథ్ కొంపెల్ల చెప్పారు. వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయంగా వీటిద్వారా మెరుగైన వృద్ధిని ఆశిస్తున్నట్లు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలియజేశారు. సంస్థ విస్తరణ ప్రణాళికలతో పాటు పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
హెల్త్‌కేర్‌లోకి కొత్తగా వచ్చారు కదా? ఎలా ఉంది?
మాకు బర్కత్‌పురాలో 60 పడకలు, హయత్‌నగర్‌లో 140 పడకల ఆసుపత్రులు ఇప్పటికే ఉన్నాయి. ఇక బంజారా హిల్స్‌లో 350 పడకల (తొలిదశ) ఆసుపత్రిని గతేడాదే ఆరంభించాం. కాకపోతే ఆ రెండు ఆసుపత్రులనూ విరించిలో ఇప్పుడు విలీనం చేశాం. ప్రస్తుతానికి ఈ విభాగం నుంచి ‘ఎబిటా’ సానుకూలంగా ఉంది. అంటే నిర్వహణ లాభాల్లోనే ఉన్నట్లు చెప్పొచ్చు. ఈ విభాగం నికరలాభం ఆర్జించడానికి మాత్రం కొంత సమయం పట్టొచ్చు.
ఈ రంగం నుంచి ఆదాయం ఎంతొస్తోంది?
రెండో త్రైమాసికంలో ఈ రంగం రూ.85 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఇక కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే ఎబిటా రూ.140 కోట్లుగా ఉంది. మొత్తంగా చూసినపుడు రెండో త్రైమాసికంలో రూ.8 కోట్లు లాభం ఆర్జించాం.
మీది మొదట సాఫ్ట్‌వేర్ కంపెనీ కదా!! ఆ విభాగం ఎలా ఉంది?
మాకు హకీంపేటలో 10 ఎకరాల క్యాంపస్ ఉంది. అందులో ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చేస్తున్నాం. మా చేతిలో ఫిన్‌టెక్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులున్నాయి. అవి అమెరికాలో చక్కని పనితీరు కనబరుస్తున్నాయి.
ఫిన్‌టెక్ అంటే... మీరు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారా?
అదేం లేదు. మా ఉత్పత్తుల ద్వారా ఫైనాన్షియల్ సేవలందిస్తున్నాం. ఉదాహరణకు మా ఉత్పత్తుల్లో ‘క్యూఫండ్’ ఒకటి. అంటే క్విక్ ఫండ్ అన్నమాట. అమెరికాలో సబ్‌ప్రైమ్ ఖాతాదారులు మెక్‌డోనాల్డ్స్, స్టార్‌బక్స్ వంటి షాపుల్లో క్యూలో నిల్చుని కూడా క్యూఫండ్ ద్వారా రుణం తీసుకోవచ్చు. చెల్లింపులూ చేయొచ్చు. వారి తాలూకు వివరాలు, చెల్లించే స్తోమత ఇలాంటి వివరాలన్నిటినీ రియల్‌టైమ్‌లో మా ప్రొడక్ట్ ద్వారా చెక్ చేసి... సదరు షాపులోనే రుణం మంజూరు చేస్తారన్న మాట.
ఈ ఉత్పత్తికి పెద్ద పెద్ద క్లయింట్లు ఎవరైనా ఉన్నారా?
అక్కడ దాదాపు 15 మంది క్లయింట్లున్నారు. వీరిలో టాప్–5 ఫైనాన్షియల్ సంస్థలూ ఉన్నాయి. అంటే ఇవి రుణాలివ్వటానికి మా ఉత్పత్తిని వినియోగిస్తాయన్న మాట. ఇంకా ‘పే డే’ లోన్స్... ఆటో ఈక్విటీ లోన్స్ ... లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉత్పత్తులు... అప్పటికే చెల్లించేసిన వాయిదాలపై రుణమిచ్చే ఉత్పత్తులు... ఇలా చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఆటో ఈక్విటీనే తీసుకుంటే... కారు కొన్న వారు వాయిదాలు చెల్లిస్తారు కదా!!. ఓ రెండేళ్లు గడిచాక ఆ కారు విలువెంతో చూసి... తను ఇంకా ఎంత రుణం చెల్లించాలో చూసి... మిగిలింది యజమాని వాటాగా లెక్కిస్తారు. దానిపై కూడా రుణమిస్తారు. అమెరికాలో మా ద్వారా ఇప్పటికి 10 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరయ్యాయి.
మరి ఇవన్నీ ఇండియాలో పనిచేస్తాయనుకుంటున్నారా?
నిజం చెప్పాలంటే ఇవి ఇండియాకు కొత్త కాన్సెప్ట్‌లు. కాకపోతే ఆధార్ వచ్చింది. అది బ్యాంకు ఖాతాలకు అనుసంధానమవుతోం ది. పేమెంట్లకు భీమ్ యాప్ వచ్చింది. రుణాలిచ్చే సంస్థలూ ఉ న్నాయి. వీటన్నిటినీ కలిపే టెక్నాలజీని మేం అందిస్తున్నాం. అమెరికాలో మా క్యూఫండ్ డేటా బేస్‌లో 2.5కోట్ల వ్యక్తిగత రికార్డులున్నాయి. రోజుకు 15కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇదంతా ఎందుకంటే ఈ రంగంలోని అనుభవం మాకు అక్కరకొస్తుంది.
మరి హెల్త్‌కేర్‌లోకి ఎందుకొచ్చారు? సాఫ్ట్‌వేర్–హెల్త్‌కేర్ రెండూ వేరు కదా?
హెల్త్‌కేర్‌లో ఐటీని కలిపితే అద్భుతమైన ఫలితాలొస్తాయన్నది మా ఉద్దేశం. అందుకే ఈ రంగంలోకి వచ్చాం. ఉదాహరణకు మా ఆసుపత్రిలోకి వచ్చేవారు యాప్ ద్వారానే చాలా పనులు చేసుకోగలుగుతారు. డాక్టర్ల వీడియో కన్సల్టేషన్ , వారి పాత రికార్డులను వారే ఫోటో తీసి అప్‌లోడ్ చేయటం, ఆ రికార్డులు వారు డాక్టర్‌తో మాట్లాడుతున్నపుడు ఆటోమేటిక్‌గా కనిపించటం వంటివన్నీ ఉంటాయి. ప్రాసెసింగ్‌లో టెక్నాలజీ వాడటం ద్వారా చికిత్స వ్యయం తగ్గించాలన్నది మా ఉద్దేశం.
బెంగళూరు కంపెనీ మెడ్–జినోమ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లున్నారు?
అవును! ప్రస్తుతం జన్యు ఆధారిత డయాగ్నస్టిక్ పరీక్షలకు నియంత్రణ పరమైన అనుమతులున్నాయి. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుతున్నాం కనక మెడ్‌జినోమ్ మాతో ఒప్పందం చేసుకుంది. కాకపోతే జన్యు చికిత్సలకు ఇంకా అనుమతుల్లేవు. అనుమతుల్లేనివి చెయ్యటం లేదు. కణ ఆధారిత చికిత్సలూ ఇలాం టివే. ఇంకా గుండెకు వేరబుల్ డివైజ్‌ను అమర్చి ట్రాక్ చెయ్యటం వంటివన్నీ చేస్తున్నాం. దీంతో అనవసర చికిత్స ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. మా హెల్త్‌కేర్ యాప్‌ను దేశమంతటా లాంఛ్ చేస్తున్నాం. యూపీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నాం.
మీ హెల్త్‌కేర్ టార్గెట్ ఏంటి?
వచ్చే ఐదేళ్లలో హెల్త్‌కేర్ విఆగాన్ని 5వేల పడకలకు చేర్చాలన్నది మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే పనిచేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment