న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 33 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,902 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,545 కోట్లకు పెరిగినట్లు హిందుస్తాన్ జింక్ తెలిపింది. రూపాయి బలపడినప్పటికీ, అమ్మకాలు అధికంగా ఉండడం, లోహాల ధరలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఆదాయం రూ.5,232 కోట్లకు చేరిందని, వార్షికంగా చూస్తే ఇది 37 శాతం వృద్ధి చెందిందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన మాత్రం ఐదు శాతం వృద్ధి చెందిందని ఆయన తెలియజేశారు. మొత్తం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.5,796 కోట్లకు పెరిగిందని చెప్పారాయన. ఇక మొత్తం వ్యయాలు రూ.2,278 కోట్ల నుంచి రూ.2,763 కోట్లకు పెరిగాయని వివరించారు.
రికార్డ్ స్థాయికి వెండి అమ్మకాలు
వెండి అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉండటంతో ఈ క్యూ2లో మంచి పనితీరు సాధించామని అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో లోహ ఉత్పత్తి 39 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందిందని వివరించారు.
రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు వంద శాతం (రూ.2) మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.19,979 కోట్లుగా ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment