ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది కూడా నిరాశ తప్పదని తాజా అధ్యయనం తేల్చింది. 2018 తొలి త్రైమాసికంలో టాప్ ఐటీ కంపెనీలు మెరుగైన ఫలితాలను ప్రకటించినప్పటికీ పరిశ్రమ నియామకాలు ఆశించిన స్థాయిలో ఉండవని సమాచారం. ముఖ్యంగా టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దేశీయ టాప్ ఐటి కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఉద్యోగాల ఆశ అంతనంత దూరంలో ఉండవని విశ్లేషకుల తాజా అంచనా. నియామకాల వృద్ధి ఈ సంవత్సరం స్తబ్దుగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
నాస్కామ్ ప్రకారం, ఐటీ పరిశ్రమ 2018-19లో ఒక లక్ష కొత్త ఉద్యోగాలను జోడించనుంది. గత ఏడాది జూన్‌లో ఐటీ , బిపిఎం పరిశ్రమలో 1.3-1.5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలకు తల కిందులై కేవలం లక్షకు లోపే నియామకాలు నమోదు అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఈ ఆర్థికసంవత్సరంలో ఐటీ నియామకాలు ఫ్లాట్‌గా ఉండనున్నాని అంచనా. అయితే 2016-17లో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉండటం గమనార‍్హం. కొత్త ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ బేటా ఎనలటిక్స్ వైపు మళ్లుతున్నాయని సంస్థ మాజీ అధ్యక్షులు డెబ్జానీ ఘోష్ వ్యాఖ్యానించారు. ఈ ఏరియాల్లో 2018లో మొత్తం డిమాండ్ 5.11 లక్షలుగా ఉందనీ, ఇది 2021నాటికి 7.86 లక్షలకు చేరుకుంటుందన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగం కూడా మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన నాస్కామ్ హెచ్‌ఆర్ సదస్సులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పరిశ్రమలో ఏడాది చివరి నాటికి దాదాపు 40 లక్షల మంది ఉద్యోగులుంటారని భావిస్తున్నామన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ఆటోమేషన్ ప్రక్రియ, వ్యయాలను తగ్గించుకునే కంపెనీ ప్రయత్నాలు దీనికి కారణాలుగా ఉన్నాయి. అదే సమయంలో ఐటి కంపెనీలు ఉన్న ఉద్యోగులతోనే ఎక్కువ పనికోసం ఉపయోగించుకుంటున్నాయని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, సీఈవో క్రిస్ లక్ష్మికాంత్ ఇటీవల చెప్పారు. పెరుగుతున్న ఆటోమేషన్ నియామకంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment