భవనం దెబ్బతింటే? బీమాతో నిర్మాణ వ్యయం భర్తీ!
► హోమ్ ఇన్సూరెన్స్‌తో సొంతింటికి ధీమా
► బీమాతో ఇంట్లోని విలువైన వస్తువులకూ రక్షణ
► గృహరుణ వ్యక్తి మరణిస్తే బ్యాంకులకు చెల్లింపులు కూడా..
కష్టార్జితం ధారపోసి సొంతిల్లుకొనడంతోనే సరిపోదు. దురదృష్టం వెంటాడి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ ఇల్లు నాశనం అయ్యిందా? గోవిందే! అందుకే ఈ మధ్య కాలంలో దేశంలో ఇంటికి బీమా చేయించుకోవటం బాగా పెరిగిపోయింది. హోమ్ ఇన్సూరెన్స్‌తో ప్రకృతి వైపరీత్యాలు,అగ్ని ప్రమాదాలు, దొంగతనాలతో జరిగే ఆస్తి, ఆర్ధిక నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు మరి!
సాక్షి, హైదరాబాద్: ‘హోమ్ ఇన్సూరెన్స్’ ఇప్పుడు దేశంలో బాగా వినిపిస్తున్న పేరు. సొంతగా ఇంటిని నిర్మించుకుంటున్న వారు కేవలం గృహరుణ చెల్లింపులకే కాకుండా ఇంటి మొత్తానికి బీమా రక్షణ తీసుకుంటున్నారు. రుణం తీసుకొని ఇంటిని నిర్మించుకున్నప్పుడు రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఇక చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి బ్యాంకులకు చెల్లిస్తుంది. అది కాకుండా నిర్మించుకున్న కలల సౌధానికి ఎటువంటి నష్టం జరిగినా దాన్ని భర్తీ చేసుకునేందుకు బీమా పథకాలు ఉన్నాయి.
బీమా 2 రకాలు..
హోమ్ ఇన్సూరెన్స్‌లు రెండు రకాలుగా ఉంటాయి. 1. బిల్డింగ్ ఇన్సూరెన్స్ 2. కంటెంట్ ఇన్సూరెన్స్. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో.. ప్రధానంగా ఇంటి స్ట్రక్చర్‌కు బీమా రక్షణ ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి నిర్మాణం దెబ్బతింటే దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే వ్యయం లేదా కూల్చి పూర్తిగా కొత్తది కట్టుకోవాలంటే దానికి అయ్యే ఖర్చునూ బీమా కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకు భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటి నిర్మాణానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని బీమా కంపెని తిరిగి చెల్లిస్తుందన్నమాట. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్.. ఇందులో ఇంటిలోని విలువైన వస్తువులకు బీమా రక్షణ కల్పిస్తుంది.
నగలు, బాండ్లకు రక్షణుండదు..
పాలసీ డాక్యుమెంట్లో వేటికి బీమా రక్షణ కల్పిస్తారు? వేటికి ఉండదో వివరంగా ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని ఒకసారి పరిశీలించడం మర్చిపోవద్దు. ఇంటిలో ఉండే నగదు, విలువైన కాగితాలు, బాండ్లు వంటి వాటికి బీమా రక్షణ ఉండదు. అలాగే 50 ఏళ్లు దాటిన ఇంటికి, పదేళ్లు దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా రక్షణను ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. దాదాపు అన్ని నాన్‌లైఫ్ (సాధారణ) బీమా కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా కంపెనీలతో పాటు ఇఫ్కో టోక్యో, ఐసీసీఐ లాంబార్డ్, టాటాఏఐజీ, బజాజ్ అలయంజ్ వంటి కంపెనీలు అందిస్తున్నాయి.
భూకంప ప్రాంతాల్లో ఇల్లుంటే?
ప్రీమియం ఎంత అనేది మీరు నివసించే ప్రాంతం, ఇంటికి భద్రతకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ప్రీమియం విలువలో సెస్మిక్ జోన్.. అంటే భూకంప రావడానికి ఉండే అవకాశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ సెస్మిక్ జోన్3లోకి వస్తుంది. అంటే భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. అదే విశాఖపట్నం వచ్చేసరికి భూకంప అవకాశాలు చాలా తక్కువ. దీని ప్రకారం విశాఖపట్నం కంటే హైదరాబాద్ ఇంటికి ప్రీమియం అధికం ఉంటుంది. కాని హైదరాబాద్‌కు సునామీ ముప్పు లేదు. అదే విశాఖపట్నంకు సునామీ తీవ్రత హెచ్చుగా ఉంటుంది.
ఇలా ప్రీమియం లెక్కించేటప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకునే భద్రతా చర్యలు కూడా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. అత్యాధునికమైన లాకర్స్, దొంగతనం జరిగేటప్పుడు, అగ్నిప్రమాదం జరిగేటప్పుడు హెచ్చరించే అలారంలు ఏర్పాటు చేసుకుంటే ప్రీమియం ధరలు తగ్గుతాయి. సాధారణంగా భూకంపం, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అధిక అవకాశం ఉన్న వాటికి ప్రతీ రూ.1,000లకు రూపాయి ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. మిగిలిన వాటికి 70 పైసలు వరకు ఉంటుంది. అదే కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వస్తువుల విలువను విడివిడిగా లెక్కించి దాని ఆధారంగా బీమా రక్షణ విలువను లెక్కిస్తారు.