గౌరవించడంతో ట్యాక్స్పేయర్లలో మార్పు
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను గౌరవించడం వల్ల పన్ను చెల్లించే విషయమై ప్రజల వైఖరిలో మార్పు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సకాలంలో పన్ను చెల్లించడం అన్నది ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు. సకాలంలో పన్ను చెల్లించి మార్గదర్శకంగా నిలిచిన పలువురు ట్యాక్స్‌పేయర్లను అభినందిస్తూ జైట్లీ సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సకాలంలో పన్నులు చెల్లించిన 8.43 లక్షల మందిని అభినందిస్తూ ‘లెటర్ ఆఫ్ అప్రీసియేషన్’ను ఐటీ శాఖ మెయిల్ చేయనుంది. రూ.ఒక లక్ష నుంచి రూ.కోటికి పైగా పన్ను చెల్లించే వివిధ వర్గాల వారు ఈ మెయిల్స్ అందుకోనున్నారు. పన్నులను చెల్లించే విషయమై ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ చర్యలు ఫలితమిస్తాయని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ముందుకు రండి.. పూర్తి గోప్యత’
నల్లధనం వెల్లడికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్చంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం గడువు ఈ నెల 30తో ముగియనుండడంతో ఆదాయపన్ను శాఖ అసెస్సీలకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తోంది. ఈ పథకంలో భాగంగా వెల్లడించే రహస్య ఆస్తుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని, ఎవరితోనూ పంచుకోబోమంటూ ఎస్‌ఎంఎస్‌లలో హామీ ఇస్తోంది. ఐడీఎస్ పథకంలో భాగంగా అక్రమ ఆస్తులను ప్రకటించి వాటి విలువపై మొత్తంగా 45 శాతం పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈ పన్నును కూడా మూడు వాయిదాలుగా చెల్లించవచ్చు. 25 శాతాన్ని మొదటి వాయిదాగా నవంబర్‌లోపు చెల్లించాలి. మరో 25 శాతాన్ని 2017 మార్చిలోపు, మిగిలిన 50 శాతాన్ని 2017 సెప్టెంబర్‌లోగా చెల్లించాల్సి ఉంటుంది.