టర్మ్‌పాలసీ ఎంతకు తీసుకోవాలి..? | how much should be term of the policy ? | Sakshi
Sakshi News home page

టర్మ్‌పాలసీ ఎంతకు తీసుకోవాలి..?

Published Mon, Mar 31 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

how much  should be term of the policy  ?

రానున్న పదిహేనేళ్లలో నెలకు రూ.30,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించాలనుకుంటున్నాను. కొన్ని ఫండ్స్‌ను ఎంపిక చేశాను. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరిలో   బిర్లా సన్‌లైఫ్ టాప్ 100, ఎస్‌బీఐ బ్లూచిప్, యూటిఐ ఆపర్చునిటీస్ ఫండ్స్‌ను, మిడ్-అండ్-స్మాల్ క్యాప్ కేటగిరీల్లో మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఎంపిక చేశాను.

అయితే వీటిల్లో ఫైనల్‌గా ఏ ఫండ్స్‌ను ఎంచుకోవాలి, ఎంతెంత మొత్తం వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. ఇక నేను ఇప్పటికే బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్‌డాక్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను.  - శశికళ, హైదరాబాద్

 విస్తృతమైన కసరత్తు చేసి మీరు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మీరు మంచి ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీర్ఘకాలానికైతే, ఈక్విటీల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులు పెద్దగా ప్రభావం చూపవు.  మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో చాలా బావుంది. దీంట్లో మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం లేదు. వీటిల్లో పెట్టుబడులను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు.

 ప్రస్తుతమున్న ఈ 4 ఫండ్స్‌కు హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్‌ను జత చేయండి. దీంతో మీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 5 ఫండ్స్ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.30 వేలను కలుపుకొని, ఈ 5 ఫండ్స్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియో మంచి డైవర్సిఫికేషన్‌తో  ఉన్నది. మంచి రాబడులనివ్వగలుగుతుంది.

 నేను 7-10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇలైట్ మ్యాక్సి మిజర్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200 ఫండ్స్‌ను షార్ట్ లిస్ట్ చేశాను. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందో సూచించండి.  - జాన్సన్, గుంటూరు

 బీమా అనుసంధాన పాలసీలు మంచి రాబడులు ఇస్తున్నప్పటికీ, వాటి విషయంలో కొన్ని సమస్యలు ఇంకా తొలగిపోలేదు. మీరు దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ మీరు త్వరగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని చూస్తే, జరిమానా చెల్లిం చాల్సి ఉంటుంది. మీ బీమా అవసరాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మీకసలు బీమా అవసరమే ఉండదు. మీకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత, మీపై ఆధారపడే వ్యక్తులు పెరిగి, ఆదాయం ఆర్జించే వ్యక్తిగా మీకు బీమా తప్పనిసరి అవుతుంది. ఇక మీరు ఎంపిక చేసిన పాలసీలు ఆ అవసరాలను తీర్చలేవు. ఏదైనా టెర్మ్ ప్లాన్‌ను ఎంచుకోండి, టెర్మ్‌ప్లాన్‌కు ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయం మీ టెర్మ్  కవర్‌గా ఉండాలి.

 హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100ల్లో  సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్ సరైన విధంగానే ఉన్నాయా? తగిన సూచనలివ్వండి?  - సయ్యద్ సత్తార్, కొత్తగూడెం

 మీరు మంచి ఫండ్స్‌నే ఎంచుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఫండ్స్ పనితీరు సంతృప్తికరంగా లేనప్పటికీ, నిరాశ చెందాల్సిన పని లేదు. భవిష్యత్తులో  ఇవి మంచి పనితీరునే కనబరుస్తాయి. అయితే డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్100ను మినహాయించవచ్చు. మీ పోర్ట్‌ఫోలియో నుంచి ఈ ఫండ్‌ను తప్పించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు.

 ఇండెక్సేషన్ లెక్కించిన తర్వాత డెట్ ఫండ్స్ ద్వారా రూ.2 లక్షల క్యాపిటల్ గెయిన్స్ పొందాను. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది?
 - పాపారావు, విజయనగరం
 డెట్ ఫండ్స్ నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను విషయమై స్పష్టమైన నిబంధనలున్నాయి. దీర్ఘకాలిక మూల ధన లాభాలపై పన్ను రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది వచ్చిన లాభాలపై పది శాతం ఫ్లాట్‌గా చెల్లించడం. ఇక రెండోది ఇండెక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకొని 20 శాతం పన్ను చెల్లించడం. ఈ రెండు విధానాల్లో మీకు ఏది ప్రయోజనకరమనుకుంటే దానిని అనుసరించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement