పొదుపు పెట్టుబడులే ఆదాయానికి మార్గం కాదు
ఏటేటా ఆదాయం పెంచుకోవాలంటే ఉద్యోగాలు మారాలా? పొదుపు పెట్టుబడులు పెట్టాలా? అయితే కాసేపు ఈ రెండింటి సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు ఖర్చు పెట్టినది పెట్టుబడి కిందికే వస్తాయి. ఉదాహరణకు ఆరోగ్యం మీద పెట్టుబడి. అంటే వ్యాయామం చేసేందుకు జిమ్‌కు వెళ్లటం.. లేదా జిమ్ సామగ్రిని కొనుగోలు చేయడం వంటివి. వీటి కొనుగోలుకు మొదట్లో కాస్త డబ్బు ఖర్చయినా.. దాంతో వచ్చే శారీరక, మానసిక ఆరోగ్యం మనల్ని అనారోగ్యాలకు దూరం చేస్తుంది.
దీంతో ఆసుపత్రులు, వైద్య ఖర్చులంటూ అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఓ రకంగా ఆదాయాన్ని ఆదా చేసినట్టేగా! ఖర్చు కూడా పెట్టుబడి కిందే లెక్కే కదా!! ఇలా మన ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో మీరే చదవండి మరి.
మీ మీద మీరే పెట్టుబడి
* మీ మీద మీరే పెట్టుబడి పెట్టుకోండి. అంటే క్వాలిటీ లైఫ్ స్టయిల్ కోసమని దానర్థం. దీంతో మీరే కాదు మీ కుటుంబ సభ్యులూ ఆరోగ్యంగా ఉంటారు. రోజురోజుకూ మార్కెట్లోకి వస్తున్న సరికొత్త ట్రెండ్స్, స్కిల్స్, లాంగ్వేజ్‌లను నేర్చుకోండి. సమయం దొరికితే ఉపయుక్తమైన, స్ఫూర్తిదాయకమైన బ్లాగులు, ఆర్టికల్స్‌ను చదవండి.
* మీ ఆలోచనలు, సృజనాత్మకతకు పదును పెట్టండి. మీకు నచ్చిన.. వచ్చిన క్రియేటివ్ ఆలోచనలను కార్యరూపమివ్వండి. వీటి మీద మీరు పెట్టే ప్రతి పైసా భవిష్యత్తులో ఉపయుక్తమే. సృజనాత్మక ఆలోచనలతో వ్యక్తిగతంగానే కాకుండా వ్యవస్థాగతంగానూ గుర్తింపు పొందుతారు. మీకు మీరే రీచార్జ్ అవుతారు.
* దీంతో ఆదాయం ఎలా పెరుగుతుందంటే.. సృజనాత్మకత.. నైపుణ్యం, విస్తృతమైన పరిజ్ఞానం ఉన్నవారికి మార్కెట్లో బోలెడన్నీ ఆదాయ మార్గాలు, అవకాశాలుంటాయి.
దీర్ఘకాలమే బెటర్
* మనలో చాలామంది స్వల్పకాలిక అవసరాలపైనే ఎక్కువగా దృష్టిపెడతారు.. ఉదాహరణకు పదవీ విరమణ తర్వాత జీవితం కోసం పెట్టుబడి పెట్టకపోవడం, ఇల్లు కొనుగోలులాంటివి. ఈ కోవలోకే వస్తాయి. వీటికోసం ఆర్జన మొదలు పెట్టినప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. మనసులో పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకున్నప్పుడు అనవసర వ్యయాలు చేయడానికి మనసొప్పదు. ఈక్విటీల వంటివాటిలో పెట్టుబడులకైతే కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువుండేలా చూసుకోవాలి. అదే రుణ సంబంధిత పెట్టుబడులైతే సాధ్యమైనంత వరకూ ఐదేళ్ల కంటే తక్కువుండేలా చూసుకోవటం మంచిది.
* దీనికీ ఆదాయ ఆర్జనకేంటీ సంబంధం అంటే.. తెలివిగా మనం పెట్టే ప్రతిపైసకూ లాభాలొస్తాయి. అంతేగానీ తొందరపాటుతో క్షణికావసరాల మీద పెట్టుబడులు పెట్టొద్దు.
ఆరోగ్యం మీద పెట్టుబడి
* నిజమైన ఆదాయమంటే ఆరోగ్యమే. అందుకే పెట్టుబడుల్లో కొంతలో కొంతైనా శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలపై పెట్టడం మేలు.
* శారీరక, మానసిక ఆరోగ్యమంటే.. ఓ సర్వే ప్రకారం పట్టణాల్లో ఉండే చాలా మంది ఉద్యోగులు మానసిక రుగ్మతలకు లోనవుతున్నారట. పని ఒత్తిడి, రక్తపోటు, ఆగ్రహావేశాలు ఇందుకు కారణమట. దీంతో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతాం. అందుకే నిత్యం వ్యాయామం, యోగా, ప్రాణామాయం వంటివి చేయాలి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్య ఖర్చులు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు ఇంటి తిండి తిన డమే బెటర్.
* సామాజిక ఆరోగ్యమంటే.. మనమే కాదు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచితేనే మనం ఆరోగ్యంగా ఉంటా. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, పర్యావరణం పచ్చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన ఆలోచనలు రెట్టింపు ఉత్సాహంతో సాగుతాయి. మీరు వ్యక్తిగతంగానే కాదు.. సామాజికంగానూ పురోగమిస్తారు.
కెరీర్ మీద దృష్టి..
కెరీర్ మీద పెట్టుబడులు.. అదీ దీర్ఘకాలికంగా ఉపయోగపడే కెరీర్ మీద పెట్టడం మంచిది. అప్పుడే వృత్తిలోను, ప్రవృత్తిలోనూ వేగంగా ముందుకెళతారు. ఉదాహరణకు.. మన వృత్తిపరమైన అవసరాలేంటో గుర్తించి వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. అంటే వృత్తిపరంగా మన బలం, బలహీనతలేంటో గుర్తించాలి. అందుకు తగ్గ శిక్షణ తీసుకోవాలి. సరికొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. అప్పుడే సుశిక్షితులైన ఉద్యోగిగా.. ప్రొఫెషనల్‌గా గుర్తించబడి మరింత మెరుగైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. దీంతో మీ సామర్థ్యానికి సరైన వృత్తిలో రెట్టింపు ఆదాయాన్ని ఆర్జిస్తారు.
బీమా కూడా పెట్టుబడే
ప్రమాదాలను ఎదుర్కొవడానికి తీసుకునే బీమా కవరేజ్‌లు కూడా మనల్ని కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్తాయి కూడా. వ్యక్తిగత బీమానే కాదు.. వాహన, గృహ బీమాలూ అలాంటివన్నమాట. ఎందుకంటే ప్రమాదాలు ఎదురైతే వ్యక్తిగత బీమా ఉంటే ఆసుపత్రి, వైద్య ఖర్చులకు ఎలాగైతే బీమా ఉంటుందో.. అలాగే వాహన, గృహ ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటికీ బీమా వర్తిస్తుంది. దీంతో అకస్మాత్తుగా వచ్చే పెద్ద ఖర్చుల నుంచి బయటపడతాం. అంటే జేబులోని చిల్లిగవ్వ ఖర్చు కాకుండా వాటిని తిరిగి పొందుతామన్నమాట. ఇదీ ఓ రకంగా ఆదాయాన్ని ఆదా చేసినట్టేగా.
ఆ ఖర్చు కూడా పెట్టుబడే
Published Mon, Dec 21 2015 2:49 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement