ఆదాయం-పొదుపు= ఖర్చులు
రాజా చిరుద్యోగి స్థాయి నుంచి కాస్త పై స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఆదాయమూ పెరిగింది. జీతం పెరిగితే ఎంతో కొంత దాచిపెట్టొచ్చు .. కారో, ఇల్లో కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది కదా అని మొదట్లో సంతోషపడుతూ వచ్చాడు. కానీ ఆదాయంతో పాటు ఖర్చులూ పెరిగాయి. ఫలితంగా జీతం అయిదు వేలు ఉన్నప్పుడూ సరిపోలేదు.. యాభై వేలు వస్తున్నప్పుడూ ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇక, పొదుపు ఎక్కణ్నుంచి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. దీంతో అర్జంటుగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సమూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్లుగానే కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. అవేంటంటే..
పొదుపు చేయగా మిగిలినదే ఖర్చులకు..
సాధారణంగా అంతా ఖర్చులన్నీ పోగా ఏదో కొద్దిగా మిగిలితే దాన్ని పొదుపు చేద్దాం అనుకుంటారు. వారు ఫాలో అయ్యే ఫార్ములా ఆదాయం-ఖర్చులు = పొదుపు. కానీ, నిజంగా పొదుపు చేయడం ద్వారా లాభపడాలంటే.. దీన్ని కాస్త అటూ ఇటుగా మార్చుకోవాలి. ప్రతి నెలా కచ్చితంగా ఇంత పొదుపు చేయాలని నిర్ణయించుకుని దాన్నే ఆదాయం నుంచి తీసేస్తే మిగిలే మిగతా మొత్తాన్ని ఖర్చులకు కేటాయించాలి. అంటే ఆదాయం - పొదుపు = ఖర్చులు అన్నమాట.
ఖర్చులను నియంత్రించడం సాధ్యం ఎలాగూ కాదు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే మనకి వచ్చే ఆదాయంలో ముందస్తుగానే కొంత మొత్తాన్ని పొదుపు కోసం తీసి పక్కన పెట్టడం వల్ల చేతిలో ఉండే డబ్బుతోనే మిగతా ఖర్చులను చక్కబెట్టాల్సిన పరిస్థితి కల్పించుకుంటే ఆటోమేటిక్‌గా వ్యయాలపై కొంతైనా నియంత్రణ వస్తుంది. ఇక, ఈ పొదుపు మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బైటికి లాగేసే విధంగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సదుపాయం ఉందంటే ఏదైనా కాస్త ఎక్కువ ఖర్చులు ఎదురైన ప్రతిసారీ మనసు అటు లాగేస్తూ ఉంటుంది.
అందుకే, అంత సులభసాధ్యంగా విత్‌డ్రా చేసే వీలు ఉండని సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సాధనాలు ఇలాంటి దీర్ఘకాలికమైన సాధనాలే. ప్రతి నెలా ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తాన్ని కంపెనీ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంటుంది. రిటైరయ్యే దాకా ఆ పొదుపు మొత్తం వడ్డీలతో కలిసి పెరుగుతూ ఉంటుంది. పదవీ విరమణ చేసే నాటికి కాస్త పెద్ద మొత్తం చేతికొస్తుంది. ఏవో కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే దీన్ని ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది.
చిన్న మొత్తంతోనైనా శ్రీకారం..
పొదుపు, ఇన్వెస్ట్ చేయాలన్న తలంపు వచ్చినప్పుడు భారీ మొత్తం చేతికొచ్చినప్పుడే చేయాలనుకోనక్కర్లేదు. చాలా మంది ఈ తప్పే చేస్తుంటారు. ఎంతో కొంత చొప్పున ప్రతి నెలా చిన్న మొత్తాలను మొదలుపెట్టి ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుకుంటూ పోవచ్చు. చక్రవడ్డీల ప్రభావంతో కొన్నాళ్లకు పెద్ద మొత్తమే అవుతుంది. పెద్ద మొత్తం కూడబెట్టే దాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈలోగా కొంగొత్త ఖర్చు లంటూ పుట్టుకొస్తూనే ఉంటాయి.
చేతిలో ఉన్న డబ్బు హారతికర్పూరం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతీ సంవత్సరం పొదుపు మొత్తాన్ని ఎంతో కొంత పెంచుకుంటూ వెళ్లగలగాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సిప్‌లలో పెట్టుబడులు కావొచ్చు మరొకటి కావొచ్చు చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఇక, మనం చేసే దాన్ని బట్టే ఫలి తాలు ఉంటాయి.
ఇన్వెస్ట్ చేయడం బదులు అనవసర ఖర్చు చేయడం వల్ల మనకు రావాల్సిన రాబడి పోవడంతో పాటు.. కొన్నదాన్ని నిలబెట్టుకోవడం మరొకటి.. ఆపై మరొకటి కొనుక్కుంటూ పోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. అలాగని, మరీ లోభిత్వం చేయాలనీ కాదు. ఎక్కడ ఖర్చు పెట్టాలి.. ఎక్కడ తగ్గాలి అన్నదీ కొంత ఎరుకతో వ్యవహరిస్తే మంచిది.
లగ్జరీ ట్యాక్స్ విధించుకోవడం..
పొదుపు చేయడం అంటే చిన్న సరదాలను కూడా తీర్చుకోకుండా మరీ పర్సును బిగించేసి పిసినారిగా వ్యవహరించాలని కాదు. ఒకవేళ విలాసవంతమైన వస్తువేదైనా భారీ సొమ్ము వెచ్చించి కొన్నా.. మళ్లీ ప్రణాళిక గాడి తప్పకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు.. ఖరీదైన మొబైల్ ఫోనో మరొకటో కాస్తంత లగ్జరీ వస్తువేదైనా తీసుకున్నప్పుడు.. దాదాపు అంతే మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు కోసం మళ్లించేసేందుకు ప్రయత్నించాలి. ఇదొక విధంగా మనపై మనం విధించుకునే లగ్జరీ ట్యాక్స్ లాంటిదే. కానీ, ఇందులో ప్రయోజనం ఏమిటంటే.. మనకు కావాల్సిన వస్తువు దక్కించుకోవడంతో పాటు మన ఆర్థిక క్రమశిక్షణ కూడా గాడి తప్పకుండా చూసుకోవచ్చు.
కెడిట్ కార్డులు తగ్గించాలి..
క్రెడిట్ కార్డులు అవసరానికి రుణం ఇచ్చి ఆదుకోగలిగినా.. ఖర్చులపై అదుపులేని వారి విషయంలో ఇవి చాలా ప్రమాదకరమైనవి. కార్డుతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సింపుల్‌గా ఒక స్లిప్‌పై సంతకం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా జేబులో నుంచి అప్పటికప్పుడు డబ్బు కట్టాల్సిన పని ఉండదు కాబట్టి సదరు కొనుగోలు భారం తక్షణం తెలియదు. కానీ మరుసటి నెల ఇతర ఖర్చులతో పాటు కార్డు బకాయిలు పేరుకుపోయి కట్టలేని పరిస్థితి తలెత్తినప్పుడు వస్తుంది అసలు తంటా.
అందుకే, సాధ్యమైనంత వరకూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు అసలు భారం అప్పటికప్పుడు తెలుస్తుంది కనుక కొంత అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే, మన లక్ష్యాలు రాసుకున్న చిన్న చీటీని గానీ కుటుంబసభ్యుల ఫొటోలు గానీ క్రెడిట్ కార్డుపై అతికించి ట్రై చేయొచ్చు. స్వైప్ చేయడానికి కార్డు తీసిన ప్రతిసారీ దానిపై కనిపించే లక్ష్యాలు ఠక్కున కనిపించి.. సదరు కొనుగోలు గురించి పునరాలోచించుకునే వీలు కలుగుతుంది. వృథా ఖర్చులకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది.