శాంసంగ్కు చుక్కెదురు
బీజింగ్: టెక్ దిగ్గజం శాంసంగ్ కు చైనా టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హువాయి సవాల్ విసిరింది. తన ప్రత్యర్థి మొబైల్ ఫోన్ తయారీ సంస్థలో అగ్రగామిగా నిలిచిన శాంసంగ్ కు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. పేటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, చైనాలలో వ్యాజ్యాలు దాఖలు చేసింది. తన ముఖ్యమైన టెక్నాలజీ విషయంలో పేటెంట్ ను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తోంది. హువాయి టెక్నాలజీస్ లిమిటెడ్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తనకు రీజనబుల్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ఎంత చెల్లించాలని అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అంచెలంచెలుగా విస్తరిస్తోన్న బ్రాండ్‌లలో హువాయి ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ తన మార్కెట్ షేర్ ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో హువాయి ప్రకటన ప్రపం వ్యాప్తంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ పరిశ్రమలో సాంకేతిక సృష్టికర్తలు , పోటీదారుల మధ్య నెలకొన్న పోటీని హైలైట్ చేసింది. మరోవైపు మొబైల్ అమ్మకాల్లో శాంసంగ్ యాపిల్ ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొబైల్ అమ్మకాల్లో 24.5 వృద్ధిని సాధించి నెం.1 స్థానాన్ని కొట్టేసింది. ఆపిల్ 15.3 శాతం అమ్మకాలతో రెండవస్థానంతో సరిపెట్టుకోగా హువాయి 8.2 శాతం అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచి, దిగ్గజ కంపెనీలతో పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో హువాయి, శాంసంగ్ ను సవాల్ చేయడం విశేషం.