ఫోర్టిస్ హెల్త్‌కేర్ వ్యవహారం చూస్తుంటే భారీ కుంభకోణమేదో బయటపడుతుందన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ర్యాన్‌బాక్సీతో అంచెలంచెలుగా ఎదిగి దాని విక్రయంతో బిలియనీర్ సింగ్ సోదరులుగా ఖ్యాతిగాంచిన మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు స్థాపించిన ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో పలు పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వరుస రాజీనామాలు, తరచుగా రీస్ట్రక్చరింగ్‌లు జరగటమే కాక... తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ప్రమోటర్లకు చెందిన రెండు హోల్డింగ్ కంపెనీల ఆస్తుల్ని జప్తు చేయటం గమనార్హం.
ఈ వరుస పరిణామాలతో ఇప్పటికే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన ఈ సంస్థ వారి సంపదను కూడా భారీగా హరించేసింది. ట్రెజరీ ఆపరేషన్లలో భాగంగా సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట రూ.473 కోట్ల నిధులను కొల్లగొట్టిన బోర్డ్.. ఈ నిధులను సింగ్ సోదరుల ఇతర కంపెనీలకు బదలాయించేసిందనే ఆరోపణలు కొనసాగడం చూస్తుంటే ఫోర్టిస్ హెల్త్‌కేర్ మరో సత్యం కానుందని అనిపిస్తున్నట్లు ‘మనీలైఫ్’ పత్రిక పేర్కొంది.
ఇది మామూలు మళ్లింపు కాదు: ఇన్‌గవర్న్
నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం అనేది పలు కంపెనీలలో తరచుగా జరిగేదే అయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న తరలింపు మాత్రం సత్యం, యూబీ గ్రూప్ తరహాలోనే ఉందని... ప్రాక్సీ వోటింగ్ అడ్వైజరీ సంస్థ ఒకటి అభిప్రాయపడింది. బెంగళూరుకు చెందిన ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపిన సమాచారం మేరకు కంపెనీ ప్రమోటర్లకు చెందిన పూర్తి అనుబంధ సంస్థల ద్వారా నిధులు మళ్లిపోగా.. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోలేదని తెలిసింది.
నియంత్రణ సంస్థలకు ఎటువంటి సమాచారం లేకుండానే అనుబంధ సంస్థలు సంబంధిత వ్యక్తులకు రుణాలను మంజూరీ చేశాయి. మరోవైపు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... నిధులకు సంబంధించిన విషయాలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్ తమకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించి.. ఇందుకు ఈ నెల 26వ తేదీని (ఫిబ్రవరి, 2018) గడువుగా నిర్ణయించింది. ఒక కంపెనీ సంబంధిత వ్యక్తులకు రుణాలను జారీ చేయటం కంటే ముందే వాటాదారుల అనుమంతి పొందాల్సి ఉంటుందని కంపెనీల చట్టం 2013, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెబుతుండగా ఈ నిబంధనను ఫోర్టిస్ హెల్త్‌కేర్ అనుబంధ సంస్థలు పూర్తిగా విస్మరించాయి.
కంపెనీ ఆర్థిక ఫలితాలను కూడా సమయానికి వెల్లడించకుండా రెలిగేర్ హెల్త్ ట్రస్ట్ ఆస్తులను విలీనం చేసుకోవడంలో నిమగ్నమైపోయిన ఫోర్టిస్ హెల్త్‌కేర్ బోర్డ్.. ఫిబ్రవరి 13న సమావేశం అయినప్పటికీ ఇదే నెల 28 వరకు అనుమతి పొందిందే తప్ప ఫలితాలను ఇప్పటికీ ప్రకటించకలేదు. ఇదంతా చూస్తుంటే స్కామ్ భారీ స్థాయిలోనే జరిగి ఉంటుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.
కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫోర్టిస్ హాస్పిటల్స్ ద్వారా గతేడాదిలో నిధుల మళ్లింపు జరిగిందని, అప్పుడు కూడా షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే ఇదంతా జరిగిపోయిందని వెల్లడించిన ఇన్‌గవర్న్ రీసెర్చ్.. ఇలాంటి నిర్ణయాలు ఫోర్టిస్‌లో సర్వసాధారణంగా మారిపోయాయని తెలియజేసింది. సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కొల్లగొట్టిన మొత్తాన్ని బ్యాలెన్స్ షీటులో ఆస్తుల వైపు కరెంట్ లోన్స్ రూపంలో చూపించాల్సి ఉండగా.. కన్సాలిడేటెట్ బ్యాలెన్స్ షీటులో నగదు కింద ఈ మొత్తాన్ని చూపింది. ఇది గతేడాదిలో రూ.142 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఈమొత్తం రూ.544 కోట్లుగా ఉందని, ఇంతగా పెరగడం అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు విరుద్ధమని వివరించింది.
గతంలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ దారి మళ్లించిన నిధులు
♦ 2010లో ఫోర్టిస్ మారిష్ అనే 100% అనుబంధ సంస్థ ద్వారా పార్క్‌వే హోల్డింగ్స్ సింగపూర్‌లో 25% వాటాను కొనుగోలుచేసింది.
♦ ఎఫ్‌సీసీబీ మార్గంలో రూ.647 కోట్లను సమీకరించి అదే సమయంలో ఫోర్టిస్ మారిషస్‌కు రూ.395 కోట్ల రుణాన్ని ఇచ్చింది.
♦ పార్క్‌వే హోల్డింగ్స్‌లో వాటాను పెంచడం కో సం ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్ బిడ్ దాఖలు చేసింది.
♦ తొలుత ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్‌లో ఫోర్టిస్ మారిషస్‌కు 49 శాతం, ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉండగా.. ఇది క్రమంగా 100 శాతానికి పెరిగిపోయింది.
♦ రెండు సార్లు పేర్లు మార్చడం ద్వారా చివరకు ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్ కాస్తా ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్‌గా మారింది.
♦ 2010–11 సమయంలో ఫోర్టిస్ ఇంటర్నేషనల్ ద్వారా ఫోర్టిస్ ప్రమోటర్లు 6 విదేశీ ఆస్తులను కొనుగోలు చేశారు.
♦ ఈ మొత్తం వ్యవహారంలో ఫోర్టిస్ మారిషస్‌కు ఇచ్చిన రూ.395 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి.
♦ ఇప్పటికీ ఇంటర్‌నేషనల్‌కు 4.4 శాతం వడ్డీ, ఎఫ్‌సీసీబీపై 5 శాతం వడ్డీ చెల్లిస్తూనే ఉండడం కొసమెరుపు.
♦ ఇంతటి స్థాయిలో నిధుల మళ్లింపులు జరుగుతుండడం, ఇదే సమయంలో ఉన్నట్టుండి వరుసగా డైరెక్టర్లు రాజీనామాలు చేయడం చూస్తుంటే అతి త్వరలోనే ఫోర్టిస్‌లో భారీ కుంభకోణం బయటపడనుందని ఇన్‌గవర్న్ రీసెర్చ్ అంచనావేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment