సమ్మర్ స్పెషల్: 999కే విమాన టిక్కెట్
తక్కువ ధరలు కలిగిన విమానసంస్థగా పేరొందిన ఇండిగో ఇటీవలే 900 విమానాలను ఒకే రోజు ఆపరేట్ చేసి దేశీయ విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో ఉన్న ఇండిగో ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. అన్ని ధరలను కలుపుకుని విమాన టిక్కెట్ ను కేవలం 999 రూపాయలకే అందించనున్నట్టు పేర్కొంది. మూడు రోజుల ''సమ్మర్ వొకేషన్ ఆఫర్'' కింద అన్ని నెట్ వర్క్ పరిధిలో దీన్ని వర్తింపజేస్తోంది. 6ఈ నెట్ వర్క్-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
2017 ఏప్రిల్ 10 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ లైన్ పేర్కొంది. 2017 మే 1 నుంచి జూన్ 30కి మధ్యలో ప్రయాణాలకు ఎంపికచేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ తో ఈ స్పెషల్ ఫేర్స్ అందుబాటులో ఉంటాయని, ఒక్కసారి టిక్కెట్ కు చెల్లించిన ఛార్జీలు మళ్లీ రీఫండ్ చేయమని పేర్కొంది. 44 ప్రాంతాలకు చక్కర్లు కొడుతున్న ఈ సంస్థ మొత్తం 907 డైలీ ఫ్లైట్స్ ను కలిగి ఉంది.