
సాక్షి,సిటీబ్యూరో: స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ మహానగరానికి దేశంలోనే ప్రత్యేకమైన స్థానం. ఎప్పుడూ సరికొత్త పోకడలతో విస్తరిస్తూనే ఉంది. భాగ్యనగరం పరిధిలో సొంత ఇల్లు ఉండాలని కల గనేవారు.. దాన్ని నెరవేర్చుకునేవారు ఎప్పటి కప్పుడు వస్తూనే ఉన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువ కావడంతో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తూ ప్రభంజనంగా మారింది. దీంతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా దండిగా ఆదాయం సమకూరుతోంది. గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా గడిచిన తొమ్మిది నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. కొంత కాలంగా గృహ, వాణిజ్య నిర్మాణాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. అదే స్థాయిలో కొనుగోలుదారుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా గల ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలకు హైదరాబాద్ అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందడంతో ‘ఆఫీస్’ స్థలాలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్లలో ఫార్మాసిటీల నిర్మాణం స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చాయి. మరోవైపు నగరం చుట్టూ కొత్తకొత్త టౌన్‌షిప్‌లు ఏర్పాటుతో పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలకు కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు భూయజమానులతో ఒప్పందం చేసుకుని స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. భూ యజమానుల వాటాకు కొంత వాణిజ్య స్థలాన్ని ఇవ్వడంతో పరిస్ధితులు మరింత సానుకూలంగా మారాయి.
శివారు చుట్టూ డిమాండ్..
నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ప్లాట్స్, ఫ్లాట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపొచ్చింది. పలు ప్రాంతాల్లో ఈ ఏడాదిలో 20 వేల చదరపు మీటర్ల నుంచి లక్ష చదరపు మీటర్ల వరకు గల ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. మరో 30 ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండేళ్ల క్రితం 8,704 భవన నిర్మాణాలకు అనుమతి లభించగా, గతేడాది మరో 15 వేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హయత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ గృహాలకు, శేరిలింగంపల్లి, చందానగర్, యూసుఫ్‌గూడ, రామచంద్రాపురంలో అపార్ట్‌మెంట్లకు డిమాండ్ పెరిగింది.
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. స్థిరాస్తి లావాదేవీలు అంచనాలకు మించి పెరుగుతుండడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలనెలా పైకి ఎగబాకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరుకు అంటే తొమ్మిది నెలల్లోనే ఆ శాఖకు రూ.3,045 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.584 కోట్ల ఆదాయం అధికంగా సమకూరినట్లు రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం రూ.4,21 కోట్ల ఆదాయం సమకూరగా ఒక్క గ్రేటర్ నుంచే రూ.3,045 కోట్ల ఆదాయం రావడం ఇక్కడి స్థిరాస్తి లావాదేవీల ప్రభంజనాన్ని సూచిస్తోంది. నగర పరిధిలో మొత్తం 46 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. స్థిరాస్తి రంగం లావాదేవీలతో పాటు రాబడిలో రంగారెడ్డి ఆర్వో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో మల్కాజిగిరి–మేడ్చల్, మూడో స్థానంలో హైదరాబాద్ (సౌత్), నాల్గో స్థానంలో హైదరాబాద్ ఆర్వోలు నిలిచాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూరుక్‌నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరిగాయి.
స్థిరాస్తి రంగం ఇలా..
ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల పలు కంపెనీలు తరలివచ్చాయి. దీంతో వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం విస్తరించింది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రదేశాలు ఐటీ కేంద్రాలకు చేరువలో ఉండడంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాయి. ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ వరకు కొనుగోలుకు ఐటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు.
♦ మెట్రో రవాణా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది దృష్టి ఉప్పల్ మార్గం వైపు పడింది. ఇక్కడి నుంచి వరంగల్ రహదారి మార్గంలో ఘట్‌కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
♦ జాతీయ రహదారి మీదున్న ఈ ప్రాంతానికి ఈ ఏడాది మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది.
♦ రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఏ.ఎస్.రావునగర్, కొంపల్లి, శామీర్‌పేట, దమ్మాయిగూడెం, కాప్రా వరకు బహుళ అంతస్తుల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది.
♦ ఐటీ కేంద్రానికి దగ్గరలో ఉన్న ‘అప్పా’ ప్రాంతంలో నిర్మాణాలు పెరిగాయి. బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, అప్పా వరకు అభివృద్ధి విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉండడంతో ఎక్కడికైనా సులువుగా చేరుకునే వెలుసుబాటు ఉండడంతో ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment