
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం 'ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ' అనే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) పథకాన్ని గురువారం ప్రవేశపెట్టింది.ఈ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్ సిటిజన్లకు చెల్లిస్తున్నది 0.50 శాతం అధికం మాత్రమే.
5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే వృద్ధులకు ప్రధాన ఆదాయవనరని తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారిమీద ఉన్న గౌరవంతో కొత్త పథకం ద్వారా వారికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నామని ఐసీఐసీఐ లయబిలిటీస్ గ్రూప్ అధిపతి ప్రణవ్ మిశ్రా తెలిపారు. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్‌బీఐ)
సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక ఎఫ్‌డి పథకం ఐదు విషయాలు
- ఈ పథకం 2020 మే 20 నుండి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో వుంటుంది.
- ఇది ఒకే డిపాజిట్ మొత్తానికి , కాలానికి సాధారణ ప్రజలకు వర్తించే దానికంటే 80 బేసిస్ పాయింట్లను ఎక్కువ అందిస్తుంది.
- రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు కొత్త ఎఫ్‌డీల ద్వారా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. లేదా పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించుకోవచ్చు.
- రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు రూ. 2 కోట్లు లోపు ఎఫ్‌డీలపై 6.55 శాతం అధిక వడ్డీ రేటును 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో పొందుతారు.
- ప్రిన్సిపల్ మొత్తం, లేదా అక్రూడ్ వడ్డీపై 90 శాతం రుణాన్ని కస్టమర్లు పొందవచ్చు. ఎఫ్‌డీ మీద క్రెడిట్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు చెల్లించే వడ్డీని పెంచిన విషయం తెలిసిందే.
మోసగాళ్లకు చెక్ : మెసెంజర్‌లో కొత్త ఫీచర్
Comments
Please login to add a commentAdd a comment