దివాలా ముంగిట ల్యాంకో!
దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐడీబీఐకి ఆర్‌బీఐ ఆదేశాలు
బ్యాంకర్ల సమావేశం రేపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణాలు తీసుకుని, తీర్చలేక డిఫాల్ట్ అయిన మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ దివాలా ముంగిట నిలిచింది. భారీగా రుణాలు తీసుకుని తీర్చలేక ఎగవేతదారుల జాబితాలో చేరినవారిపై దివాలా ప్రక్రియ ఆరంభించాలంటూ ఇటీవలే బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే ల్యాంకోకు రుణాలిచ్చిన ఐడీబీఐ బ్యాంకుకు... ఆర్‌బీఐ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద ల్యాంకోపై చర్యలు ఆరంభించాలంటూ లీడ్ బ్యాంకరు ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఈ విషయాన్ని ల్యాంకో ఇన్‌ఫ్రా ధ్రువీకరించిది కూడా.
ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ ఫండ్ ఆధారిత బకాయీలకు సంబంధించి రూ.8,146 కోట్లు, నాన్ ఫండ్ బకాయీలు రూ. 3,221 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రూ.11,367 కోట్ల రుణాలకు సంబంధించి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించినట్లు పేర్కొంది. దీనిపై ఈ నెల 19న ఎల్‌ఐటీఎల్‌కి రుణాలిచ్చిన బ్యాంకర్లతో ఐడీబీఐ బ్యాంకు సమావేశం కానుంది.
మొత్తం మొండి బకాయీల్లో సుమారు నాలుగో వంతు రుణాలు (రూ.2 లక్షల కోట్లు) తీసుకుని ఎగవేసిన 12 కంపెనీల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా ఒకటి. ఆర్‌బీఐలోని అంతర్గత అడ్వైజరీ కమిటీ (ఐఏసీ) ఈ పన్నెండింటి జాబితాను బ్యాంకర్లకు పంపింది. వీటిలో ఆరు ఖాతాలు ఎస్‌బీఐలో ఉన్నాయి. మిగతావి పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 8 లక్షల కోట్ల పైగా మొండిబకాయిలు పేరుకుపోయాయి. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్ల బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి.