insolvency resolution
-
Go First bankruptcy: 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వండి
న్యూఢిల్లీ: కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా సమర్పించాలంటూ విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు .. పైలట్లు ..ఇతర సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు, నిధులు .. వర్కింగ్ క్యాపిటల్, లీజుదార్లతో ఒప్పందాలు తదితర వివరాలు అందులో పొందుపర్చాలని డీజీసీఏ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణాళికను సమీక్షించిన తర్వాత డీజీసీఏ తగు నిర్ణయం తీసుకోవచ్చని వివరించాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 2న స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా మే 3, 4 తారీఖుల్లో రద్దు చేసిన విమాన సేవలను ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించింది. ఈలోగా సర్వీసుల నిలిపివేతపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో మారటోరియం వ్యవధిని ఉపయోగించుకుని పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలంటూ గో ఫస్ట్ తన సమాధానంలో కోరింది. మరోవైపు లీజుదార్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. గో ఫస్ట్ దివాలా పరిష్కార పిటిషన్‌ను అనుమతించాలని ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మే 22న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
టొరంట్‌కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్‌క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్‌పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్‌క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్‌తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్‌ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్‌ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్‌తో రిజల్యూషన్‌పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
దివాలా ముంగిట ల్యాంకో!
దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐడీబీఐకి ఆర్బీఐ ఆదేశాలు బ్యాంకర్ల సమావేశం రేపు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణాలు తీసుకుని, తీర్చలేక డిఫాల్ట్ అయిన మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ దివాలా ముంగిట నిలిచింది. భారీగా రుణాలు తీసుకుని తీర్చలేక ఎగవేతదారుల జాబితాలో చేరినవారిపై దివాలా ప్రక్రియ ఆరంభించాలంటూ ఇటీవలే బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే ల్యాంకోకు రుణాలిచ్చిన ఐడీబీఐ బ్యాంకుకు... ఆర్బీఐ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద ల్యాంకోపై చర్యలు ఆరంభించాలంటూ లీడ్ బ్యాంకరు ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఈ విషయాన్ని ల్యాంకో ఇన్ఫ్రా ధ్రువీకరించిది కూడా. ల్యాంకో ఇన్ఫ్రాటెక్ ఫండ్ ఆధారిత బకాయీలకు సంబంధించి రూ.8,146 కోట్లు, నాన్ ఫండ్ బకాయీలు రూ. 3,221 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రూ.11,367 కోట్ల రుణాలకు సంబంధించి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించినట్లు పేర్కొంది. దీనిపై ఈ నెల 19న ఎల్ఐటీఎల్కి రుణాలిచ్చిన బ్యాంకర్లతో ఐడీబీఐ బ్యాంకు సమావేశం కానుంది. మొత్తం మొండి బకాయీల్లో సుమారు నాలుగో వంతు రుణాలు (రూ.2 లక్షల కోట్లు) తీసుకుని ఎగవేసిన 12 కంపెనీల్లో ల్యాంకో ఇన్ఫ్రా కూడా ఒకటి. ఆర్బీఐలోని అంతర్గత అడ్వైజరీ కమిటీ (ఐఏసీ) ఈ పన్నెండింటి జాబితాను బ్యాంకర్లకు పంపింది. వీటిలో ఆరు ఖాతాలు ఎస్బీఐలో ఉన్నాయి. మిగతావి పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 8 లక్షల కోట్ల పైగా మొండిబకాయిలు పేరుకుపోయాయి. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్ల బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి.