అమ్మకానికి ‘డీసీ’ ట్రేడ్మార్క్లు
♦ ఈ నెల 24న వేలం వేయనున్న ఐడీబీఐ బ్యాంకు
♦ లిస్టులో ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్
♦ ట్రేడ్‌మార్క్‌లు కూడా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్‌ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరుతేదీగా పేర్కొంది. డెక్కన్ క్రానికల్‌కు రూ. 120 కోట్లు, ఆంధ్రభూమికి రూ. 3.5 కోట్లు, ది ఏషియన్ ఏజ్‌కు రూ. 18 కోట్లు, ఫైనాన్షియల్ క్రానికల్‌కు రూ. 3 కోట్లు రిజర్వ్ ధరగా ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది.
ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్ తదితర 18 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డీసీహెచ్‌ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీంతో కంపెనీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఒకే పూచీకత్తుపై పలు సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంతో న్యాయవివాదాలు కూడా నెలకొన్నాయి. ఐడీబీఐ బ్యాంకు పలుమార్లు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇతరత్రా రుణదాతల నుంచి అడ్డంకులు ఎదురవడంతో వీలు కాలేదు. తాజాగా రుణదాతలంతా ఒక అంగీకారానికి రావడంతో వేలానికి మార్గం సుగమమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.