బహుళజాతి సంస్థపై కేసు గెలిచిన పుణె రెస్టారెంట్
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్‌లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది.
దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు.
విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment