
సాక్షి, న్యూఢిల్లీ : రెండో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా, టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని అధిగమించింది. అత్యధిక 4జీ అప్‌లోడ్ స్పీడులో సెప్టెంబర్ నెలలో మొదటి స్థానంలో ఐడియా సెల్యులార్ నిలిచింది. టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ మై స్పీడు యాప్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. సగటు 4జీ అప్‌లోడ్ స్పీడు సెప్టెంబర్‌లో ఐడియాది 6.307 ఎంబీపీఎస్ ఉందని ట్రాయ్ డేటా తెలిపింది. ఇదే నెలలో కంపెనీ సగటు డౌన్‌లోడ్ స్పీడు 8.74 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు పేర్కొంది. మైస్పీడు యాప్‌ను మరింత బలోపేతం చేయనున్నామని, తమ గణాంక పద్ధతిని మరింత పారదర్శకత చేస్తామని ట్రాయ్ చెప్పింది.
ట్రాయ్ సైటులో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 4జీ అప్‌లోడ్ స్పీడులో ఐడియా తర్వాత వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు నిలిచాయి. అయితే 4జీ డౌన్‌లోడ్ స్పీడులో మాత్రం జియో, వొడాఫోన్ తర్వాత ఐడియా మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను 2.60 లక్షల సైట్లకు విస్తరిస్తామని ఐడియా సెల్యులార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు వరకు గత 12 నెలల కాలంలో 50వేల బ్రాడ్‌బ్యాండు సైట్లను కంపెనీ ఏర్పాటుచేసింది.