ఓపిక పడితేనే లాభపడతారు!
ఈ మధ్య ఏ చిన్న వార్తకైనా స్టాక్ మార్కెట్లు ఆందోళనకర స్థాయిలో స్పందిస్తున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బీపీలు తెప్పించే స్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఏ రకంగా వ్యవహరించాలో అర్థం కాక ఇన్వెస్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు హెచ్చుతగ్గులకు కారణమేంటో తెలుసుకుని... మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఒక వ్యూహాన్ని అనుసరిస్తే బాగుంటుంది. అదెలాగో ఒకసారి చూద్దాం.
తొలుత... మార్కెట్లు అంతలోనే పైకి ఎగిసి, మళ్లీ అంతలోనే కిందికి పతనమవుతుండటానికి వెనుక ఇటీవలి కారణాలను ఒకసారి చూస్తే...
వర్ధమాన మార్కెట్లపై భయాలు: ఇప్పుడు మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతుండటానికి ప్రధాన కారణాలు కమోడిటీలు ఉత్పత్తి చేసే దేశాలు, వర్ధమాన మార్కెట్లే. ఎందుకంటే కమోడిటీల ధరలు దారుణంగా పతనమయ్యాయి. కమోడిటీ ధరల అనిశ్చితితో అటు ఆయా ఉత్పత్తి దేశాలు, ఎగుమతులపై ఆధారపడుతున్న దేశాలు అనిశ్చితికి గురవుతున్నాయి.
చైనాలో మందగమనం..
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోవడంతో.. చైనా ఎగుమతులు, దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. ఎగుమతులను పక్కన పెట్టి దేశీయంగా డిమాండ్ పెంచేందుకు చైనా తీసుకున్న చర్యలు కూడా ఫలప్రదం కావడం లేదు.
కరెన్సీల పతనం..
కమోడిటీల ధరల పతనంతో వాటిని ఎగుమతి చేసే దేశాల వృద్ధి అవకాశాలపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్రెజిల్, రష్యా, అర్జెంటీనా, మలేషియా దేశాల కరెన్సీల మారకం విలువలు 2015లో ఇప్పటిదాకా దాదాపు 20 శాతం మేర పతనమయ్యాయి. వీటిల్లో కొన్ని దేశాల మార్కెట్లు మళ్లీ 2008 నాటి సంక్షోభం సమయంలోలా భారీగా క్షీణించాయి. ఈ ఏడాది నమోదు చేసుకున్న గరిష్ట స్థాయిల నుంచి 25 శాతం పైగా పడిపోయాయి. మరోవైపు, అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తికి జంక్ బాండ్ల ద్వారా ఏకంగా 330 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయి. అయితే, కమోడిటీల ధరల పతనంతో ఈ బాండ్ల మార్కెట్ కూడా గణనీయంగా తగ్గుతోంది.
స్వయం సందేహాలు
సాధారణంగానే మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అయితే, వీటితో నిమిత్తం లేకుండా.. కొందరు ఇన్వెస్టర్లు మాత్రం లాభాలు గడిస్తుంటారు. దీన్ని అదృష్టంగా కొందరు అభివర్ణిస్తారు. కానీ దీనికి సిసలైన పేరు ఏదైనా ఉందంటే.. అదే.. ఓపిక. ఈ ఓపికను ఎలా అలవాటు చేసుకోవాలి అంటే.. మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
- ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేశారు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చిందా, లేక ఇంకా మరికాస్త సమయం ఆగాల్సి ఉంటుందా?
- పెట్టుబడి పెట్టేది మీ సొంత డబ్బునేనా లేక అప్పు తీసుకుని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారా?
- సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
- నా ఆర్థిక సలహాదారు ఇస్తున్న సలహా ఏమిటి? అమ్మాలంటే మరికాస్త సమయం వేచి చూడాలంటున్నారా లేదా మరింత ఇన్వెస్ట్ చేయమంటున్నారా?
- వీటన్నింటినీ మీరు తరచూ చూసుకుంటున్నారంటే.. మీరు సరైన ట్రాక్‌లోనే ఉన్నట్లు లెక్క. ఒకవేళ హెచ్చుతగ్గులు ఇంకా మిమ్మల్ని కలవరపరుస్తుంటే ఇలాంటి వాటిని ఎదుర్కొనగలిగే కొత్త తరం ఫండ్స్‌ను గురించి మీ అడ్వైజర్‌ను సలహా అడగండి. మార్కెట్ పడినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉండకుండానూ కాపాడతాయి. ఏదేమైనప్పటికీ.. మెరుగైన రాబడులు అందుకోవాలంటే కీలకమైనవి రెండు. 1. మంచి ఈక్విటీ పోర్ట్‌ఫోలియో 2. ఓపిక!
వికాస్ ఎం. సచ్‌దేవా
ఎడెల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్