స్వల్పలాభాలతో సరి...
♦ వరుసగా ఐదో రోజూ లాభాలే
♦ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ
♦ 13 పాయింట్ల లాభంతో 24,659 వద్ద ముగిసిన సెన్సెక్స్
ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. దీంతో స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 24,659 పాయింట్లు వద్ద, నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక, ఐటీ, ఇన్‌ఫ్రా షేర్లు నష్టపోగా, లోహ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. చైనా ఎగుమతుల క్షీణత కొనసాగుతోందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో మన స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనా, గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరకు స్వల్పంగా లాభపడింది.
లోహ షేర్ల వెలుగులు...
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ధరలు పెరగడంతో లోహ షేర్లు బాగా పెరిగాయి. సెయిల్ 8.3 శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 4.6 శాతం, నేషనల్ అల్యూమినియం కంపెనీ 4.4 శాతం, హిందాల్కో ఇండస్ట్రీస్ 4.3 శాతం,హిందూస్తాన్ కాపర్ 2 శాతం, హిందూస్తాన్ జింక్, టాటా స్టీల్ షేర్లు 1 శాతం వరకూ పెరిగాయి. గత వారంలో 8-20 శాతం లాభపడిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ 2.4 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, లుపిన్ 2 శాతం చొప్పున పెరిగాయి.