అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సూచన
న్యూఢిల్లీ: భారత్ లాంటి అధిక ప్రభుత్వ రుణ భారమున్న దేశాలు రుణంసహా ద్రవ్యలోటును తగ్గించడానికి తమ మధ్య కాలిక ప్రణాళికలను తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జాంగ్ తావో సూచించారు. ప్రభుత్వ–ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. దీనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.5 శాతానికి (రూ. 5.33 లక్షల కోట్లు)కట్టడి చేయాలని, వచ్చే ఏడాది 3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని రానున్న ఫిబ్రవరి 1 బడ్జెట్ పక్కనబెట్టే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఐఎంఎఫ్ అధికారి తాజా ప్రకటన చేయడం గమనార్హం. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా ఫైనాన్షియల్ ఫోరమ్ సమావేశంలో ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
⇔ భారత్‌తోపాటు జపాన్, మలేషియాలు కూడా ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉంది.
⇔ ప్రపంచ వృద్ధిలో ఆసియా దేశాలు కీలకపాత్ర పోషిస్తాయి. 2017, 2018 సంవత్సరాలో ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థల వృద్ధి 5 శాతంగా ఉంటుంది.
⇔ 2016లో ఆసియా ఫైనాన్షియల్ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయి. సవాళ్లను తట్టుకుని నిలబడ్డాయి. ఇదే తీరు కొనసాగుతుందని భావిస్తున్నాం.
⇔ నోట్ల రద్దు వినియోగంపై తాత్కాలిక ప్రభావం చూపుతుందన్న అంచనాలతో ఐఎంఎఫ్ 2016–17 జీడీపీ వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం జరిగింది.
భారత్ లాంటి దేశాలు ద్రవ్యలోటును తగ్గించాల్సిందే!
Published Wed, Jan 18 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
Advertisement