
హరిత భవనాల్లో హాయిగా!
సాక్షి, హైదరాబాద్ : హరిత భవన విధానం అన్నది ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఇల్లు, అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయం, ఆసుపత్రి, కార్పొరేట్ కార్యాలయం, విద్యాసంస్థ, పారిశ్రామిక భవనం, విమానాశ్రయం.. నిర్మాణం ఏదైనా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది. అంటే కరెంటు బిల్లులో పొదుపు సాధ్యమవుతుంది. ఇందుకు వీలు కల్పించేవే హరిత భవనాలు.
పర్యావరణ నిర్మాణాలకు అంకురార్పణ జరిగింది భాగ్యనగరంలోనే. 2000లో హైదరాబాద్‌లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ముఖ్య కార్యాలయాన్ని పూర్తిస్థాయి హరిత భవనంగా నిర్మించారు. సొరాబ్జీ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్‌గా పేరొందిన దీనికి హరిత భవనాల రేటింగ్ ప్రకారం అత్యుత్తమమైన ప్లాటినం రేటింగ్ లభించింది.
నిర్మాణాల నుంచి అధిక విషవాయువులు విడుదలవ్వడం.. సంప్రదాయ నిర్మాణాలు ఇరవై శాతం విద్యుత్తును వినియోగించడం తదితర అంశాలు భూతాపాన్ని పెంచుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకున్న పలు నగర నిర్మాణ సంస్థలు ఇప్పుడు హరిత భవనాల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాయి.
హరిత భవనాలు అంటేనే చాలామందిలో ఖర్చు అధికమవుతుందనే భయాలు ఉన్నాయి. స్థలం, పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్నా అత్యధికులు హరిత భవనాలపై దృష్టి సారించకపోవడానికి అవగాహన లేమే ప్రధాన కారణం. సౌర విద్యుదుత్పత్తి, నీటి పునర్వినియోగ నిర్మాణాల వల్ల కాస్త ఖర్చు ఎక్కువైనా, పర్యావరణానికి జరిగే మేలు.. నెలవారీ విద్యుత్ బిల్లులో ఆదాను దృష్టిలో ఉంచుకుంటే ఇది పెద్ద భారమేమీ కాదు. వీటిని నిర్మించే డెవలపర్లకు తగిన ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి.