20 ఏళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ...10 ట్రిలియన్ డాలర్లకు!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే 20 ఏళ్లలో అద్వితీయమైన ప్రగతిని సాధించే సత్తా ఉందని ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) పేర్కొంది. సోమవారమిక్కడ ఈ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. 2034 నాటికి దేశీ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.620 లక్షల కోట్లు) ఎగబాకనుంది. అంతేకాదు మళ్లీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కూడా వార్షికంగా 9 శాతాన్ని అందుకోనుందని నివేదిక వెల్లడించింది.
పారిశ్రామిక రంగం కృషి, ప్రభుత్వం పోషించబోయే నిర్మాణాత్మక పాత్ర ఈ ప్రగతికి కీలకంగా నిలవనున్నాయని పేర్కొంది. ‘భవిష్యత్తు భారత్-విజయ ప్రస్థానం’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో పీడబ్ల్యూసీ ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.124 లక్షల కోట్లు) చేరువలో ఉంది. ‘భారత్ ఇప్పుడు అత్యంత ప్రధానమైన మార్పు అంచున నిలబడింది. మళ్లీ 9 శాతం వృద్ధి, 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించాలంటే... కార్పొరేట్ ఇండియా మద్దతు, కృషి చాలా అవసరం. అదేవిధంగా ప్రభుత్వంతో నిర్మాణాత్మక భాగస్వామ్యం కూడా కీలకమే’ అని పీడబ్ల్యూసీ పేర్కొంది. కాగా, ఈ 10 ట్రిలియన్ డాలర్లలో 40 శాతం వాటా కొత్త సొల్యూషన్ల(వ్యాపారాలు, ఆలోచనలు) నుంచే సాకారం కానుందని కూడా నివేదిక తెలిపింది.
‘వచ్చే 12-18 నెలల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోనుంది. అయితే, భారత్‌లో మాత్రం మంచి వృద్ధి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య సరైన భాగస్వామ్యం, సమన్వయంతో ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం అంచనా వేస్తున్న 5 శాతం కంటే చాలా అధిక స్థాయిలోనే సాధించే సత్తా భారత్‌కు ఉంది’ అని నివేదిక విడుదల సందర్భంగా పీడబ్ల్యూసీ ఇంటర్నేషనల్ చైర్మన్ డెన్నిస్ నాలీ వ్యాఖ్యానించారు.
ఆర్థిక అభివృద్ధి ఫలాలను 125 కోట్లకుపైగా ఉన్న జనాభా అంతటికీ పంచడం ద్వారానే సరైన ప్రగతికి ఆస్కారం ఉంటుందని నాలీ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి చూస్తే జీడీపీ వృద్ధి రేటు 5.5-6 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, తమ పీడబ్ల్యూసీ నివేదికలో పేర్కొన్న విధంగా కార్యచరణ ఉంటే కచ్చితంగా 9 శాతం వృద్ధి రేటు సాకారమవుతుందన్నారు.
నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...
కీలకమైన విద్య, హెల్త్‌కేర్, వ్యవసాయం, రిటైల్, విద్యుత్, తయారీ, ఆర్థిక సేవలు, పట్టణీకరణ వంటి రంగాలతోపాటు డిజిటల్, ఫిజికల్ అనుసంధానానికి సంబంధించి ప్రాజెక్టుల సాకారానికి అనేక సవాళ్లు పొంచిఉన్నాయి.
భారీ స్థాయిలో మానవ వనరులను(ఉద్యోగాలు) కల్పించడంతో పాటు వచ్చే రెండు దశాబ్దాల్లో మానవ వనరుల అభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో విప్లవాత్మక పురోగతి అవసరం.
సగానికిపైగా యువ జనాభా, డిజిటల్ పరిజ్ఞానాలను వినియోగిస్తున్న మధ్యతరగతి ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం... భారత్ ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అద్భుత అవకాశం.
రానున్న దశాబ్దాల్లో పెరగనున్న జనాభా, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రతి ఏటా 1-1.2 కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది.
తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు(సుస్థిర ప్రభుత్వానికి మద్దతు) ఆర్థికాభివృద్ధిపై ప్రజలకున్న ఆకాంక్ష, సమాజంలో అందరికీ వృద్ధి ఫలాలు దక్కాలన్న దృఢమైన కోరికకు సంకేతం.
9 శాతం జీడీపీ వృద్ధి రేటు ద్వారా తలసరి ఆదాయం ఇప్పుడున్న దాదాపు 1,500 డాలర్ల(సుమారు రూ.93 వేలు) నుంచి 7,000 డాలర్ల(సుమారు రూ.4.3 లక్షలు) స్థాయికి ఎగబాకవచ్చు.
కేవలం సంస్థలు, కంపెనీల కృషితోనే భారత వృద్ధి పుంజుకోవడం సాధ్యం కాదని.. ఇందుకు నవకల్పనలు(ఇన్నోవేషన్) చాలా కీలకమని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. కార్పొరేట్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.