రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి! | India has potential for 8% growth in 2-3 years, says NITI Aayog | Sakshi
Sakshi News home page

రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి!

Published Fri, Aug 25 2017 1:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి! - Sakshi

రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధి!

పుష్కలంగా అవకాశాలున్నాయ్‌: నీతి ఆయోగ్‌
మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక విడుదల
సామాజిక రంగాల్లో సంస్కరణలపై సూచనలు
ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థల్లో కూడా...


న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతానికి పైగా నమోదవడానికి పుష్కలంగా అవకాశాలున్నట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణల ఫలాలు దేశంలోనిమొత్తం 125 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాలు సమకూర్చేలా ఉండాలని కూడా సూచించింది. ఆర్థిక, న్యాయ, నియంత్రణ వ్యవస్థలతోపాటు సామాజిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి ‘మూడేళ్ల సమగ్ర ప్రణాళిక– 2017–18 నుంచి 2019–20’ని గురువారం ఆవిష్కరించింది. నల్లధనం, అవినీతి నిరోధం, పన్ను పరిధి పెంపు, సివిల్‌ సర్వీసులు, ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ వంటి కీలక అంశాలపై సూచనలు కూడా ఇందులో ఉన్నాయి. భారత్‌ 2016–17 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ ఫలితాలు  ఆగస్టు 31వ తేదీన వెలువడనున్న నేపథ్యంలో నీతి ఆయోగ్‌ తాజా ప్రణాళిక విడుదలైంది. .  

211 పేజీల  ప్రణాళికలోని కొన్ని ముఖ్యాంశాలు
వచ్చే రెండు మూడేళ్లలో 8 శాతం వృద్ధికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన భారీగా జరిగే వీలుంది.

కేంద్ర ప్రభుత్వ వ్యయాల విషయంలో భవిష్యత్‌ ప్రాధాన్యతపై దృష్టి ఉండాలి. అధిక ప్రాధాన్యతా రంగాలకు అదనపు కేటాయింపులు జరగాలి. ఇది వృద్ధి ప్రోత్సాహానికి దారితీస్తుంది.

2019–20 నాటికి అధిక నిధులను విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వేలు, రోడ్లు అభివృద్ధికి కేటాయించాలి.

ఆయా అంశాల్లో పెట్టుబడులు దేశంలో పట్టణీకరణకు దారితీస్తుంది. దీనితో చౌక గృహాలు, మౌలిక రంగం, ప్రభుత్వ రవాణా వ్యవస్థ అభివృద్ధిసహా స్వచ్ఛ భారత్‌కు ప్రోత్సాహానికి దారితీస్తుంది.

ఇక న్యాయ వ్యవస్థలో సంస్కరణల విషయానికి వస్తే– వివాదాల తక్షణ పరిష్కారం దిశగా చర్యలు ఉండాలి. ఇందుకు వీలుగా మానవ వనరుల లభ్యత, పనితీరు, నైపుణ్యత పెరగాలి.

సామాజిక రంగం విషయంలో విద్య, వైద్య రంగాలు మెరుగుపడాలి. మానవ వనరుల నైపుణ్యతలో పురోగతి ఉండాలి. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి.

రెగ్యులేటరీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలు.

దేశంలోని కుటుంబాలన్నింటికీ నిరంతర విద్యుత్‌ సరఫరా,  ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహం, డీజిల్, పెట్రోల్‌ ధరల విధానంలో సంస్కరణలు,

100 స్మార్ట్‌ సిటీల్లో సిటీ గ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యత వంటి కీలక అంశాలు నీతి ఆయోగ్‌ సిఫారసుల్లో చోటుచేసుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement