
మద్దతు ధరల విధానంలో మార్పులు
నీతి ఆయోగ్ సిఫారసులపై కేంద్రం సానుకూలత!
- ఎమ్మెస్పీ విధానానికి సమాంతరంగా ‘ధర కొరత చెల్లింపు’
- వరి, గోధుమ, చెరకు కారణంగా తగ్గుతున్న భూసారం, నీటి వనరులు
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కార్యాచరణ ముసాయిదాలో భాగంగా నీతిఆయోగ్ ఈమేరకు నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఏప్రిల్ 23న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ముసాయిదాను చర్చకు పెట్టింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు తేవాలని సిఫారసు చేసింది.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యానవన పంటలు, పాడి, పౌల్ట్రీ, చేపలు, పందుల పెంపకం తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు సాగునీటిని అందించే కార్యక్రమాలను విస్తృతంగా అమలుచేయాలని పేర్కొంది. వీటన్నింటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏఎంసీ)లో మార్పులు తేవాలని పేర్కొంది. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు అమ్ముకునేలా తగిన హక్కులు కల్పించడం, కొనుగోలుదారులు రైతుల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేలా వీలుకల్పించటం, ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావటం, కాంట్రాక్టు సేద్యాన్ని విస్తృతపరిచేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడం వంటి నూతన విధానాలు అవలంబించాలని నీతి ఆయోగ్ పేర్కొంది.
ఎమ్మెస్పీతోపాటుగా పీడీపీ
ఎమ్మెస్పీ విధానంలో పంటల సాగు నమూనా దెబ్బతినకుండా ఉండేందుకు ధరల కొరత చెల్లింపు విధానం (ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్–పీడీపీ) అమలు చేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. అవసరాల ఆధారంగా ధాన్య సేకరణకు ఎమ్మెస్పీ విధానం అమలు చేస్తూనే కొత్త విధానం అమలులో భాగంగా నిర్దిష్ట పంటలపై రైతులకు సరైన ధర రానప్పుడు ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేయాలని, దీనిని నేరుగా రైతుకు అందజేయాలని.. లేదంటే గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ విధానంలో ఆయా పంటలను సేకరించాలని నీతి ఆయోగ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కౌలు చట్టాల వల్ల రైతులు తమ భూములను కౌలుకు ఇవ్వకుండా అలాగే వదిలేస్తున్నారని, కొత్త కౌలు చట్టాలు తేవడం ద్వారా కౌలుదారులు, భూయజమానుల హక్కులను పరిరక్షిస్తూ ఆయా భూములను సాగులోకి తేవచ్చని పేర్కొంది. ఈ ముసాయిదా విధానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని రానున్న మూడేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది.
అసలు సమస్య ఎమ్మెస్పీతోనే..
పంటలకు కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం పంటల సాగు నమూనాను దెబ్బతీసిందని నీతి ఆయోగ్ విశ్లేషించింది. కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని పంటలు పండటం కారణంగా సాగు నమూనా గాడితప్పిందని నీతి ఆయోగ్ పేర్కొంది. గోధుమ, వరి, చెరకు ఉత్పత్తులపై అధికంగా దృష్టి పెట్టి ఆయా పంటలను సేకరించడం వల్ల ఇతర పంటలైన పప్పు ధాన్యాలు, నూనెగింజలు, తృణ ధాన్యాల పంటలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఇలా ఎమ్మెస్పీ ధరలు వివిధ పంటలపై ప్రభావం చూపడం, సాగు నమూనా దెబ్బతిన్న కారణంగా (పంటమార్పిడి లేకపోవడం) ఆయా పంటల వల్ల నీటి వనరులు క్షీణించడం, భూసారం తగ్గిపోవటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది.