భారత్ ఇక.. మధ్య దిగువ ఆదాయ దేశం!
ఆర్థిక విశ్లేషణ వెసులుబాటుకు ప్రపంచబ్యాంక్ ‘ప్రత్యేక’ నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఇక భారత్‌ను ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా ప్రస్తావించదు. భారత్‌నే కాకుండా అన్ని దేశాలనూ అభివృద్జిచెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించకుండా, వాటి ఆదాయాలకు అనుగుణంగా ప్రపంచ బ్యాంక్ వర్గీకరించింది. ఈ వర్గీకరణలో భారత్ ‘మధ్య-దిగువ ఆదాయ దేశాల’ జాబితాలో చేరింది. ‘‘ప్రత్యేక ఆర్థిక విశ్లేషణలకు వీలుగా మేము ప్రపంచ అభివృద్ధి ఇండికేటర్స్ రూపొందించాం. మధ్య ఆదాయ, మధ్య ఎగువ, దిగువ ఆదాయ, మధ్య-దిగువ ఆదాయ దేశాలన్నింటినీ కలిపి వర్థమాన దేశాలుగా పరిగణించరాదన్నది ఇండికేటర్స్ ఉద్దేశం. వర్థమాన దేశాలను గ్రూప్‌లుగా విడగొట్టాం. ఆర్థిక విశ్లేషణా ప్రక్రియ దిశలో ఈ నిర్ణయం జరిగింది. భారత్ ఆర్థిక వ్యవస్థను మధ్య-దిగువ ఆదాయ దేశంగా వర్గీకరించడం జరిగింది’’ అని వరల్డ్ బ్యాంక్ డేటా పరిశోధకుడు తారిక్ ఖోకర్ తెలిపారు. ఒక ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో ఇంకా ఆయన ఏమన్నారంటే...
♦ ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వర్థమాన ప్రపంచం’ అన్న పదాన్ని మేము మార్చేయడం లేదు. తాజా అంశం... ప్రత్యేక డేటా రూపొందించే క్రమంలో అనుసరించిన విధానం మాత్రమే. ఆర్థికంగా దేశాల పరిస్థితిని మరింత స్పష్టంగా విశ్లేషించాలన్నది మా సంకల్పం.
♦ {పపంచ బ్యాంక్ ఆర్థిక విశ్లేషణ నివేదికలను సంబంధించినంతవరకూ భారత్ ‘మధ్య-దిగువ ఆదాయ ఆర్థిక వ్యవస్థ’గా ఉంటుంది. అయితే సాధారణ వాడుకలో మాత్రం అభివృద్ధి చెందిన దేశంగానే పేర్కొనడం జరుగుతుంది.
♦ ‘వర్ధమాన ప్రపంచం’ అనే పదంపై అంతర్జాతీయంగా ఒక ఏకీకృత నిర్వచనం లేదు. వర్ధమాన దేశాలుగా పేర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆదాయ అంశాల్లో తరచూ పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది.
♦ తాజా వర్గీకరణ అనంతరం భారత్ సరసన పాకిస్తాన్, శ్రీలంకలు నిలిచాయి. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లు దిగువ ఆదాయ దేశాలుగా ఉన్నాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనాలు ఎగువ ఆదాయ దేశాలుగా ఉన్నాయి. రష్యా, సింగపూర్‌లు అధిక ఆదాయ దేశాల హోదాలకు వెళ్లగా... అమెరికా అత్యధిక ధనిక దేశంగా నిలిచింది.