తెలుగు రాష్ట్రాలకు ఇజ్రాయెల్ వ్యవ‘సాయం’
⇒ రెండు ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు
⇒ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకున్న ఇజ్రాయెల్ తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో సమావేశం కానున్నట్టు భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ తెలిపారు. బుధవారమిక్కడ ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం, నీటిపారుదల, ఔషధాలు, ఆరోగ్యం వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలతో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు.
ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రానికి 20 ఎకరాల దాకా అవసరం అవుతుందని ఇజ్రాయెల్ ఎంబసీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాన్సుల్ కెన్ ఉదయ్ సాగర్ వెల్లడించారు. ‘ఏడాదిలో ఇవి కార్యరూపంలోకి రానున్నాయి. ప్రతి కేంద్రానికి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి కావొచ్చు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, టెక్నాలజీ, సేవల గురించి రైతులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు. భారత్‌లో ఇలాంటి కేంద్రాలు ప్రస్తుతం 14 ఉన్నాయి. 2020 నాటికి మరో 16 నెలకొల్పాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం’ అని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ మాట్లాడారు.