భారత్ ఓ కాంతిపుంజం
♦ బలమైన వృద్ధి దిశగా వర్ధమాన దేశాలు
♦ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే
వాషింగ్టన్: బలమైన వృద్ధి, ఆదాయం పెరుగుదల వంటి అంశాల కారణంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో భారత్ ఒక కాంతిపుంజంలా దూసుకె ళ్తోందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, కమోడిటీ ధరల తగ్గుదల, చాలా దేశాల్లో ద్రవ్య సంకట పరిస్థితులు ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి అంచనాలు బలహీనంగా మారాయని వివరించారు. అయితే వర్ధమాన దే శాలు బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పుంజుకోవాల్సి ఉందని, కానీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డా రు. ఆమె జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని గోతే యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.
బ్రెజిల్, రష్యాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని లగార్డే చెప్పారు. ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో మధ్యతూర్పు ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు, తక్కువ ఆదాయమున్న దేశాలు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలి పారు. కానీ భారత్ మాత్రం వీటికి భిన్నంగా బల మైన వృద్ధితో ముందుకు దూసుకె ళ్తోందని పేర్కొన్నా రు. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆసియా దేశాలు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయని తెలిపారు.
వృద్ధి చోదక పాలసీలే లక్ష్యంగా
చాలా దేశాలు వృద్ధికి దోహదపడే పాలసీల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయని లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయ వ్యయాల ప్రాధాన్యతలను మార్చడం వల్ల దీన్ని సాధించవచ్చని చెప్పారు. భారత్ ఎనర్జీ సబ్సిడీలపై వ్యయాలను తగ్గించుకుందని, ఇక్కడ మిగిలిన నిధులను వృద్ధికి దోహదపడే ఇన్‌ఫ్రా రంగంలో ఇన్వెస్ట్ చేసే అవకాశముందని వివరించారు. జపాన్ పిల్లల సంరక్షణపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాధాన్యం పెరిగి, తద్వారా రానున్న కాలంలో ఆ దేశంలో వృద్ధి ఎగసే అవకాశముందని పేర్కొన్నారు.