విదేశీ బ్యాంక్పై భారతీయ జంట వేలకోట్ల దావా
మెల్ బోర్న్: భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని కోరుతూ భారతీయ వ్యాపారవేత్త అతని భార్య ఓ విదేశీ బ్యాంకు పై పిటిషన్ దాఖలు చేశారు. మూసివేయబడిన వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్జిలైజేషన్ కంపెనీలో తమ షేర్లను తక్కువ ధరకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్, రాధిక ఆస్ట్రేలియన్ బ్యాంకు కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వేలకోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగారు. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్జెడ్) సుమారు 6733 కోట్ల రూపాయలను చెల్లించాలని కోరుతూ విక్టోరియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
2010 బర్రప్ ఫెర్టిలైజర్స్ కంపెనీలోని సుమారు 65 శాతం వాటాలను 4వందల మిలియన్ డార్లకు అమ్ముకున్నారని ఓస్వాల్ తరపున సీనియర్ న్యాయవాది టోనీ బనాన్ వాదించారు. ఈ విక్రయం నాటికి ఈ షేర్ల అసలు ధర 9 వందల మిలియన్ల డాలర్లు ఉందని ఆయన తెలిపారు. ఈ పరిణామంతో భారీగా నష్టపోయి అప్పుల్లో కూరకుపోయిన తన క్లయింట్ కు ప్రస్తుత విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే తన గ్రాహకత్వాన్ని వదులుకోవాలని బర్రప్ ఫెర్టిలైజర్స్ ప్రతినిధి బెదిరించారని ఓస్వాల్ దంపతులు ఆరోపించారు. దీంతో మిలియన్ల డాలర్లు ఇతర షేర్లను బలవంతగా అమ్మకోవాల్సి వచ్చిందని తెలిపారు. స్వాన్ రివర్ లో తాజ్ మహల్ గా అభివర్ణించే తమ నివాస నిర్మాణాన్ని సగంలో వదిలేసుకున్నట్టు చెప్పారు. ఖరీదైన జెట్, విలాసవంతమైన కార్లను అమ్ముకున్నామని పేర్కొన్నారు.
మరోవైపు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ఎటో) 136 మిలియన్ డాలర్ల పన్ను బకాయిలు ఉన్నాయని గత నెల నోటీసులిచ్చింది. సదరు పన్నులు చెల్లించకపోతే పంకజ్ ఆస్తులను జప్తు చేస్తామనిడంతో పంకజ్ దంపతుల ఆందోళనలో మునిగిపోయారు. సోమవారం విచారణ ప్రారంభమైన ఈ కేసులో దాదాపు25 మంది లాయర్లు ఇరువైపులా వాదనలు వినిపించారు. ఇప్పటికే మిలియన్ డాలర్లు వెచ్చించిన అతి క్లిష్టమైన ఈ విచారణకు మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.