భారీగా దెబ్బతిన్న ఐటీ ఇండస్ట్రి
భారీగా దెబ్బతిన్న ఐటీ ఇండస్ట్రి
Published Fri, Jun 16 2017 5:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
154 బిలియన్ డాలర్ల గల దేశీయ ఐటీ పరిశ్రమ ఇన్ని రోజులు ఓ కలల ప్రపంచంగా ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి ఎక్కడం, ముంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావం ఐటీ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ దెబ్బతో ఉద్యోగాలు భారీగా ఊడటమే కాకుండా.. కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడానికి కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. అన్ని రంగాల్లో కెల్లా ఐటీ పరిశ్రమలోనే నియామకాల ప్రక్రియ భారీగా దెబ్బతిన్నిందని తాజా అధ్యయన రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 2017 మే నెలలో ఏడాది ఏడాదికి ఐటీ కంపెనీల నియామకాలు 17 శాతం మేర పడిపోయినట్టు వెల్లడైంది. ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగుతుందని తెలిపాయి. ఇతర టెక్ ఉద్యోగాలు బీపీఓ 10 శాతం, టెలికాం 7 శాతం కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. నోకరీ.కామ్, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా డాక్యుమెంట్ల ఆధారంగా ఈ అధ్యయనాలు వెల్లడయ్యాయి.
మొత్తంగా టెక్ పరిశ్రమ భారీగా దెబ్బతిన్నింది కానీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో నియామకాలు 18 శాతం పడిపోయినట్టు తెలిసింది. కన్ స్ట్రక్షన్ రంగంలో అసలు ఉద్యోగాలే లేవని అధ్యయనం తెలిపింది. అయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగ నియామకాలు 8 శాతం, 4 శాతం పెరిగినట్టు తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఎక్కువగా కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమల్లో ఆటో ఇండస్ట్రి 20 శాతంతో అత్యధిక రేటు సంపాదించినట్టు తెలిపాయి. మొత్తంగా 2017 మే నెలలో కొత్త ఉద్యోగాల వృద్ధి 4 శాతం నెగిటివ్ గా నమోదైంది. అయితే ఐటీ ఇండస్ట్రిలో నెలకొన్న ఉద్యోగాల కోతపై రీసెర్చ్ సంస్థలు, ఇండస్ట్రి బాడీ భిన్నమైన రిపోర్టులు ఇస్తూ ఎంప్లాయీస్ లో భయాందోళనలు రేపుతున్నాయి. రీసెర్చ్ సంస్థలు భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెబుతుండగా.. నాస్కామ్ మాత్రం ఆ రిపోర్టులను కొట్టిపారేస్తోంది.
Advertisement