బడ్జెట్ రోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్లు!
భారత స్టాక్ మార్కెట్లకు ప్రతి శని, ఆదివారాలు సెలవులు. కానీ, ఈనెల 28వ తేదీ కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. ఆరోజు శనివారం అయినా కూడా సంప్రదాయానికి భిన్నంగా స్టాక్ మార్కెట్లను తెరిచి ఉంచనున్నారు. అంటే ఆరోజు లావాదేవీలు కొనసాగుతాయన్నమాట. ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాలను బట్టి ఆయా రంగాలకు చెందిన షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు రావడం సర్వ సాధారణం. ఏయే రంగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలుంటాయన్న అంచనాలతో ముందునుంచి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. అంచనాలకు అనుగుణంగా ఉంటే సెన్సెక్స్ ఒక్కసారిగా రయ్యిమని పెరగడం, పరిశ్రమకు అనుకూలంగా లేకపోతే ధడేల్మని పడిపోవడం కూడా ఎప్పుడూ చూస్తుంటాం.
ప్రతిసారీ కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 28నే ప్రవేశపెడుతుంటారు. అది ఈసారి శనివారం రావడంతో.. బ్రోకర్ల విజ్ఞప్తి మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండింటినీ తెరిచి ఉంచుతామని, ఆరోజు లావాదేవీలు కొనసాగుతాయని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. ఈసారి పలు సంస్కరణలు ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు.