35% తగ్గనున్న చమురు దిగుమతుల బిల్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌తో ముడిచమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం భారత్ క్రూడ్ దిగుమతుల బిల్లు 35 శాతం మేర తగ్గనుంది. 73.28 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 4.73 లక్షల కోట్లు) పరిమితం కానుంది. 2014-15లో సుమారు 112 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.87 లక్షల కోట్లు) విలువ చేసే 189 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది.
ఈసారి దాదాపు 188 మిలియన్ టన్నుల దాకా దిగుమతి చేసుకోవచ్చని అంచనా. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాల ప్రకారం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో భారత్ 43.6 బిలియన్ డాలర్ల విలువ చేసే 115 మిలియన్ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంది. దీని బట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో 73.28 బిలియన్ డాలర్ల విలువ చేసే 188 మిలియన్ టన్నుల క్రూడ్ దిగుమతయ్యే అవకాశం ఉందని పీపీఏసీ అంచనా వేసింది.
ఇందుకోసం బ్యారెల్ చమురు ధర 55 డాలర్లగాను, రూపాయి మారకం విలువ 65గాను లెక్కగట్టింది. బ్యారెల్ ధర ఒక్క డాలరు మారితే నికర దిగుమతి బిల్లు రూ. 3,513 కోట్ల మేర (సుమారు 0.54 బిలియన్ డాలర్లు) మారిపోతుంది. అదే మారకం విలువ రూపాయి మేర మారితే .. చమురు దిగుమతి బిల్లు రూ. 2,972 కోట్లు (దాదాపు 0.46 బిలియన్ డాలర్లు) పైగా మారిపోతుంది.
భారత్ కొనుగోలు చేసే క్రూడాయిల్ రకం (ఇండియన్ బాస్కెట్) రేటు 2013-14లో బ్యారెల్‌కు 105.52 డాలర్లుగా ఉండేది. ఇది 2014-15లో సగటున 84.16 డాలర్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటున 55.79 డాలర్లుగా ఉంది.