భారత్ మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 5
ఈ నెల 20 నుంచి విక్రయాలు
- ధరలు రూ.53,990 (32 జీబీ) రూ.59,900 (64 జీబీ)
న్యూఢిల్లీ: శామ్‌సంగ్ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేటగిరిలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. గెలాక్సీ నోట్ 5 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధరలు రూ.53,990థ (32జీబీ), రూ.59,900 (64జీబీ)గా నిర్ణయించామని శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్(ఐటీ అండ్ మొబైల్) ఆశిమ్ వర్శి చెప్పారు. ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమెలెడ్ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.
గత నెలలో ఈ ఫోన్‌ను అమెరికాలో అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.30,000 ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది అన్ని రకాల(ఫీచర్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లు) డివైస్‌ల విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించామని వివరించారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లలో భారత్ ఒకటని, 2017లో రెండో అతి పెద్ద మార్కెట్‌గా అమెరికాను తోసిరాజని ఆ స్థానంలోకి భారత్ దూసుకెళుతుందని పేర్కొన్నారు.