ఇండిగో ఎయిర్‌లైన్స్ మరో నిర్వాకం ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసింది. ప్రయాణికుడి పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే తాజాగా మరో వివాదంతో ఇండిగో సంస్థ వారల్లో నిలిచింది. సంబంధిత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఉండగానే అనుకున్న సమయానికంటే.. విమానం ముందుగా బయలుదేరిపోవడం ఆందోళన రేపింది. గోవా నుంచి హైదరాబాద్ విమానం షెడ్యూల్ సమయానికి కంటే ముందుగానే టేక్‌ఆఫ్ తీసుకుంది. దీంతో బోర్డింగ్ పాస్‌లతో ఎదురుచూస్తున్న 14 మంది ప్రయాణికులు ఉసూరుమన్నారు. ఇదేమి నిర్వాకమంటూ ఎయిర్‌లైన్స్‌పై మండిపడుతున్నారు. గోవా విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన చోటుసుకుంది.
6ఈ 259 ఇండిగో విమానం సోమవారం రాత్రి 10.50 గంటలకు గోవానుంచి బయలుదేరాల్సి ఉంది, కానీ ఎటువంటి ప్రకటన చేయకుండానే 25 నిమిషాల ముందు బయలుదేరిపోయిందని ప్రయాణీకులు ఆరోపించారు. హైదరాబాద్ విమానాశ్రయానికి 12.05 లకు చేరాల్సి ఉండగా, 11.40 నిమిషాలకే చేరుకుందని వాదించారు. మేము లేకుండా తమ లగేజీ విమానంలో ఎలా తీసుకెళ్తారు.. ఇది సెక్యూరిటీ లోపం కాదా అని ప్రయాణికుడు డా. సుదర్శన్ ప్రసాద్ ధ్వజమెత్తారు. కనీసం ఎనౌన్స్‌మెంట్ కూడా చేయలేదని మరో ప్రయాణికుడు ఆరోపించారు. అంతేకాదు టికెట్లకోసం రూ.55,000 చెల్లించమని అడిగారని పాసెంజర్ ఆరాధన పోదావల్లి వాపోయారు. సమయానికి ఎవరైనా ప్రయాణికులు రాకపోతే... ఎలాంటి తటపటాయింపు లేకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఎయిర్ లైన్స్ అధికారులు.. విమానాన్నిఎందుకు ముందుగా పంపించాల్సి వచ్చింది.. మరి దీనికి జరిమానా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఇండిగో అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రయాణికుల వాదనలను వ్యతిరేకించారు. అనేకసార్లు లౌడ్ స్పీకర్‌లో ప్రకటించినా ఫలితం లేకపోవడంతో వారి ప్రయాణికులు అందించిన ఫోన్ నంబర్లను సంప్రదిస్తే..వారి ట్రావెల్ ఏజెంట్ థామస్ కుక్ రిసీవ్ చేసుకున్నారని, పాసెంజర్ల ఫోన్ నంబర్లు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపింది. అంతేకాదు వారికోసం అనేక ప్రయత్నాలు చేశామని ఆయన తెలిపారు. బోర్డింగ్ గేటు దగ్గరికి అనుకున్న సమయం రాత్రి10.30కే ముగియగా వారు 10.33కు చేరుకున్నారు అందు వారిని "గేట్ నో-షో"గా ప్రకటించినట్టు తెలిపారు. అలాగే తమవైపు ఎలాంటి తప్పు లేకున్నా...వారిని మరుసటి విమానంలో ఉచితంగా తరలించామంటూ తమని తాము సమర్ధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment