
సాక్షి, హైదరాబాద్: దేశీయ ఎయిర్ క్యారియర్ ఇండిగో మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సమయాని కంటే ముందే వచ్చినా ఆలస్యమైందని చెప్పి విమానం ఎక్కకుండా వైమానిక సిబ్బంది ఓ ప్రయాణిడిని అడ్డుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన చోటు చేసుకోగా..సిబ్బంది వైఖరిపై మండిపడుతూ బాధితుడు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండిగో సిబ్బందినీ నిలదీస్తున్న వైనం ఈ వీడియోలో రికార్డయింది. దీంతో ఈ విడియో వైరల్ అయింది.
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 6ఈ-743ఎయిర్‌టికెట్‌ను బుక్ చేసుకున్నారు. విమానం బయలుదేరే సమయం ఉదయం 5.40గంటలు కాగా, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 5.22గంటలకు ఎయిర్‌లైన్స్ బస్సు ఎక్కి విమానం దగ్గరికి చేరుకున్నారు. కానీ ఆలస్యంగా వచ్చానని చెప్పి విమానం ఎక్కనీయకుండా సిబ్బంది తిరస్కరించడంతో వివాదం మొదలైంది. బోర్డింగ్ పాస్‌తో సహా, నిర్దేశిత సమయం కంటే ముందుగా చేరుకున్నప్పటికీ తనతోపాటు ఓ మహిళ, ఒక బాలుడినీ విమానం ఎక్కడానికి అంగీకరించలేదంటూ బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తచేశారు. విమానం ఎక్కేందుకు సమయం కంటే ముందే వచ్చానని, అయినా తనను ఎక్కనీయకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఆలస్యమైతే..బోర్డింగ్ పాస్ తీసుకొని, బస్సు ఎలా ఎక్కేవాళ్లమని, ఇది ఇండిగో, దాని సిబ్బంది అహంకార ధోరణికి నిదర్శమని మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనను ధృవీకరించిన ఇండిగో తప్పును ఒప్పుకుంది. బోర్డింగ్ గేట్ సిబ్బంది నిర్లక్ష్యమని అంగీకరించింది. బోర్డింగ్ ముగిసిన తరువాత విమానంలోకి అనుమతించకపోవడం తమ సిబ్బంది తప్పుగా పేర్కొంది. ప్రయాణికుడిని తరువాత ఫ్లైట్ ద్వారా గోవాకు ఉచితంగా తరలించడం సహా,ఇతర అవకాశాలను కల్పించామని వివరణ ఇచ్చుకుంది.